కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూంలలో హిడెన్ కెమెరాలు బ్లూమీడియా సృష్టి మాత్రమేనని.. అక్కడ కెమెరాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... వైసీపీ నేతల సినీనటి వేధింపుల కేసు, మద్యం కుంభకోణం, భూ అక్రమాలు వరుసగా బయటపడుతుండటంతో వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హిడెన్ కెమెరాల నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో చదివే విద్యార్థులంతా తన బిడ్డల్లాంటి వారేనని.. వారిని క్షేమంగా కాపాడుకునే బాధ్యత పూర్తిగా తమదేనని చెప్పుకొచ్చారు.
గుడ్లవల్లేరులో నలుగురు విద్యార్థుల మధ్య జరిగిన ఒక వ్యక్తిగత అంశం ఈ గొడవకు కారణమైందని, సంబంధిత విద్యార్థిని డీటెయిన్ చేసి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని లోకేష్ తెలిపారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఆహారం కలుషితమైందని తెలిసిన వెంటనే డైరక్టర్‌ను విధుల నుంచి తొలగించామని, ముగ్గురు ఉన్నతాధికారులతో పర్యవేక్షక కమిటీని నియమించామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా తాను తల్లీ, చెల్లిని రోడ్లపైకి గెంటేసే రకం కాదని, విద్యార్థినులను తన తోబుట్టువులుగా భావించి కంటికి రెప్పలా కాపాడతానని లోకేష్ స్పష్టంచేశారు.
నాడు- నేడు పేరుతో జగన్ ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుచేసినట్లు తప్పుడు లెక్కలు చెబుతోందని, అదే నిజమైతే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో గత ఐదేళ్లలో 10 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని లోకేష్ నిలదీశారు. డిజిటల్ క్లాస్ రూంలు జగన్ కొత్తగా ఏమీ కనిపెట్టలేదని, అవి అంతకుముందే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా రంగులు వేసి వందల కోట్లు దిగమింగారని దుయ్యబట్టారు.
విద్యార్థులకు సరఫరాచేసే గుడ్లు, చిక్కీలు, ఆయాల జీతాలు కూడా బకాయి పెట్టి వెళ్లారని మండిపడ్డారు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తాము విడుదల చేస్తున్నామని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.