పొట్టకూటి కోసం, చదువుకోవడానికి.. ప్రపంచ దేశాల నుంచి యూఏఈకి ఏటా చాలా మంది వెళ్తూ ఉంటారు. అందులో చాలా వరకు దుబాయ్‌కి వెళ్లేవారు ఉంటారు. మన దేశం నుంచి కూడా వేల సంఖ్యలో యూఏఈలో వెళ్లి అక్కడ పనులు చేస్తున్న వారు ఉన్నారు. ఇక అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉంటారు. అయితే యూఏఈకి వెళ్లే చాలా మంని ఇక్కడి బ్రోకర్లు.. డబ్బులు దండుకుని సరైన పత్రాలు లేకుండా అక్కడికి పంపిస్తూ ఉంటారు. వాళ్లు అక్కడికి వెళ్లిన తర్వాత యూఏఈ అధికారుల తనిఖీల్లో పట్టుబడి చిక్కుకుని ఏళ్లకేళ్లు అక్కడ చిక్కుకుని ఉంటారు. ఇక వీసా గడువు ముగిసినా కొందరు అక్కడే అక్రమంగా నివసిస్తూ ఉంటారు. కొందరు చదువుకునేందుకు వెళ్లి అక్కడ చిక్కుకుపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం యూఏఈ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
యూఏఈలో అక్రమంగా ఉంటున్నవారికోసం అక్కడి ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు యూఏఈ వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం అందుబాటులో ఉండనుందని తెలిపింది. యూఏఈలో వీసా గడువు ముగిసినా.. అక్కడే చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి వీసా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు లేదా ఎలాంటి జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు ఈ వీసా ఆమ్నెస్టీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలోనే యూఏఈలోని భారతీయులకు సహాయం చేసేందుకు అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయం కూడా ఒక అడ్వైజరీ జారీ చేసింది. 2 నెలల పాటు ఈ వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది.
యూఏఈకి విజిటింగ్ వీసాపై వచ్చినవారు, వీసా గడువు ముగిసిన వారు తమ వీసా స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. దీంతోపాటు ఎటువంటి ఫైన్లు, ఆంక్షలు లేకుండా అక్టోబర్ 30వ తేదీలోపు తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవచ్చని యూఏఈ ప్రభుత్వం తెలిపింది. ఇక యూఏఈలో పుట్టినప్పటికీ.. సరైన పత్రాలు లేనివారితోపాటు స్పాన్సర్ల నుంచి తప్పించుకుని అక్కడే నివాసం ఉంటున్న వారికి కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే అక్రమంగా యూఏఈలోకి ప్రవేశించిన వారికి మాత్రం ఈ అవకాశం వర్తించదని పేర్కొంది.
ఈ క్రమంలోనే భారత కాన్సులేట్ కీలక సూచనలు చేసింది. యూఏఈ నుంచి భారత్‌కు తిరిగి వెళ్లాలి అనుకునే వారు ఎమర్జెన్సీ సర్టిఫికేట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇక రెసిడెన్సీ స్టేటస్ రెగ్యులరైజ్ చేసుకోవాలనుకునే వారు మాత్రం స్వల్పకాలిక పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అయితే అప్లై చేసుకున్న తర్వాతి రోజు ఈ ఎమర్జెన్సీ సర్టిఫికేట్‌ను తీసుకోవచ్చని దుబాయ్‌లోని భారత కాన్సులేట్ తెలిపింది. ఈ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ల కోసం దుబాయ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో కేంద్రాలనూ బీఎల్‌ఎస్ సెంటర్లు ఏర్పాటు చేశామని.. వాటికోసం ముందస్తుగా ఎలాంటి అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఇక ఈ వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం అమల్లో ఉన్న రెండు నెలల కాలంలో ఈ ప్రత్యేక బీఎల్ఎస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయని భారత కాన్సులేట్ వెల్లడించింది. యూఏఈలో ఉన్న మొత్తం జనాభాలో దాదాపు 30 శాతం మంది ప్రవాస భారతీయులే ఉంటున్నారు. యూఏఈలో దాదాపు 35 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో 20 శాతం మంది అబుదాబీలో ఉండగా.. మిగతా 80 శాతం మంది దుబాయ్ సహా మిగతా ప్రాంతాల్లో నివసిస్తున్నారు.