జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోన్న వేళ కేరళ కాంగ్రెస్ పార్టీలో పెద్ద వివాదం నెలకొంది. సినీ పరిశ్రమలో మాదిరిగానే కాంగ్రెస్‌లోనూ ‘క్యాస్టింగ్ కౌచ్’ బెడద ఉందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు సిమీ రోస్‌బెల్ జాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో మహిళలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని ఆమె ఆరోపించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం రోస్‌బెల్ జాన్‌ను బహిష్కరించింది. ఎర్నాకుళానికి చెందిన రోస్‌బెల్ శనివారం ఓ ప్రయివేట్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది.
ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పార్టీలోనూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సహా పలువురిపై ఆమె ఆరోపణలు చేశారు. నాయకులతో సన్నిహితంగా ఉన్నవారికి మాత్రమే ముఖ్యమైన పదవులు దక్కుతున్నాయని ఆమె ఆరోపించారు. కాగా, రోస్‌బెల్ ఆరోపణలపై కేరళ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆమెను ఏఐసీసీ, పీఎస్సీ సభ్వత్వం నుంచి తొలగించి, పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కేరళ పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం లిజు ఓ ప్రకటనలో తెలిపారు. మీడియా ముందు మహిళా నేతలను కించపరిచినందుకు రోస్‌బెల్‌ను ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
‘రోస్‌బెల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోని లక్షల మంది మహిళా నేతలు, కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి.. మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి.. రాజకీయ ప్రత్యర్థులతో ఆమె కుమ్మక్కయ్యారు’ అని తెలిపారు. ఆమె వ్యాఖ్యలను క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించి, చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేశారు. అలాగే, తనపై రోస్‌బెల్ చేసిన ఆరోపణలను ప్రతిపక్ష నేత సతీశన్ తీవ్రంగా ఖండించారు.
తనను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడంపై స్పందించిన రోస్‌బెల్.. పరువు, ఆత్మగౌరవం ఉన్న మహిళలకు ఆ పార్టీలో చోటులేదని, కొంతకాలంగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని బహిష్కరించారని విమర్శించారు. ‘‘తమ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉంటే బయటపెట్టాలి.. సీపీఎం పార్టీతో కుమ్మక్కయి ఉంటే ఆధారాలు వెల్లడించాలి... ఆత్మగౌరవం, పరువు ఉన్న మహిళలు ఈ పార్టీలో పని చేయలేరు.’ అని దుయ్యబట్టారు.