న్యాయశాస్త్రం అభ్యసిస్తోన్న సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్తె గుండెపోటుతో మృతిచెందింది. హాస్టల్‌లో అచేతనంగా పడిపోయిన ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషాదకర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ రస్తోగి.. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఐజీగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె 19 ఏళ్ల అనికా రస్తోగి.. లక్నోలోని రామ్ మనోహర్ లోహియా లా కాలేజీలో బీఏ ఎల్‌ఎల్‌బీ చదువుతోంది.
ఈ క్రమంలోనే శనివారం రాత్రి తన హాస్టల్ గదిలో అనికా అచేతనంగా పడి ఉండటాన్ని తోటి విద్యార్తులు గుర్తించారు. ఆందోళనకు గురైన వారు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆకస్మిక గుండెపోటు కారణంగానే చనిపోయినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధరించారు. శనివారం రాత్రి గదిలో ఉన్న ఆమెను స్నేహితులు ఎంతగా పిలిచినా స్పందించకపోవడంతో కంగారుపడి బలవంతంగా తలుపు తెరిచారు. లోపలికి వెళ్లి చూడగా అచేతనంగా పడి ఉన్న ఆమెను చూసి షాకయ్యారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. హాస్టల్ గదిలో వారికి ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించలేదని తెలిపారు. బాధిత కుటుంబం కూడా ఫిర్యాదు చేయలేదని.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆమె శరీరంపై కూడా ఎటువంటి గాయాలు గుర్తులు లేవని చెప్పారు. కాగా, ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో కుప్పకూలుతోన్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
రెండు రోజుల కిందట ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్.. డ్యాన్స్ చేస్తు గుండెపోటుకు గురై చనిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన పై అధికారి బదిలీ కావడంతో ఆయన కోసం ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ఒకప్పుడు గుండెపోటు మరణాలు 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లోనే అధికంగా ఉండేవి. కానీ, కోవిడ్- 19 వ్యాప్తి తర్వాత నెలల చిన్నారుల నుంచి పెద్ద వయస్కుల వరకూ అందరూ గుండెపోటుతో చనిపోతున్నారు.