షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటే మామూలు హడావుడి ఉండదు. సెలబ్రిటీలు వచ్చి ప్రారంభోత్సవం చేస్తారు. ఇక ఓపెనింగ్ ఆఫర్ కింద.. షాపింగ్ మాల్ నిర్వాహకులు అనేక ఆఫర్లు ప్రకటిస్తారు. ఈ ఆఫర్లే ఆ షాపింగ్ మాల్ కొంప ముంచాయి. ఓపెనింగ్ చేసిన అరగంటలోనే ఆ షాపింగ్ మాల్ మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు విన్న జనం.. ఒక్కసారిగా ఆ షాపింగ్ మాల్‌పై ఎగబడ్డారు. ఓపెనింగ్ చేసిన అరగంటలోనే ఉన్న సామాన్లన్నీ ఎత్తుకెళ్లిపోయారు. ఒక్కరు కూడా బిల్లులు చెల్లించకుండానే.. ఆ సామాన్లన్నీ ఊడ్చుకెళ్లిపోవడంతో.. ఆ షాపింగ్ మాల్ ఓనర్‌కు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నాడు. ఒక్కసారిగా ఎగబడిన జనాన్ని కంట్రోల్ చేసేందుకు అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది సరిపోకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సంఘటన మన దాయాది దేశం పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది.
పాకిస్తాన్ కరాచీ నగరంలోని గులిస్తాన్-ఎ-జోహర్ అనే ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేశారు. పాక్‌లోని ఓ ప్రముఖ బిజినెస్‌మెన్.. డ్రీమ్ బజార్ పేరుతో షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేసి ఈనెల 1వ తేదీన గ్రాండ్‌గా ఓపెనింగ్ చేశాడు. అయితే షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా జనాలను ఆకర్షించడానికి భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించాడు. దీంతో వారు ఊహించినదాని కన్నా ఎక్కువ మంది అక్కడికి చేరుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు షాపింగ్ మాల్‌ను ఓపెన్ చేశారు.
షాపింగ్ మాల్‌ను ఓపెన్ చేయగానే పాకిస్తాన్ ప్రజలు అందులోకి చొరబడి లూటీలు చేశారు. ఒక్కసారిగా దాదాపు లక్షమంది జనం.. షాపింగ్ మాల్‌లోకి చొచ్చుకెళ్లడంతో వారిని ఆపడం అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుల వల్ల కాలేదు. మాల్‌పై మూక దాడి చేసిన జనం.. అద్దాలు, ఫర్నీచర్ సహా కనిపించింది కనిపించినట్లు ధ్వంసం చేశారు. అందులోని వస్తువులను చేతికందిన కాడికి దోచుకెళ్లారు. సంచుల్లో నింపుకుని, చేతుల్లో పట్టుకుని వారు షాపింగ్ మాల్‌లో దోపిడీలకు పాల్పడ్డారు. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ఆ జనాన్ని చూసిన డ్రీమ్ బజార్ షాపింగ్ మాల్ యాజమాన్యం ఒక్కసారిగా షాక్ అయింది. జనాల రద్దీని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నం చేసినా అవేమీ ఫలించలేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాక నిర్వాహకులు, సెక్యూరిటీ చేతులెత్తేసింది. దీంతో జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఒక్క వస్తువుకు కూడా బిల్లు లేకుండా ఎత్తుకెళ్లిపోయారు. చోరీ చేస్తే చేశారుగానీ అక్కడ షాపింగ్ మాల్ ఆస్తులను కూడా ధ్వంసం చేసి వెళ్లిపోయారు.
అయితే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చిన ప్రకటనలు, చేసిన అడ్వర్టైజ్‌మెంట్లే ఇందుకు కారణం అని స్థానికులు చెబుతున్నారు. రూ. 50 కంటే తక్కువ ధరకే వివిధ రకాల వస్తువులను తమ షాపింగ్ మాల్‌లో విక్రయిస్తామంటూ నిర్వాహకులు ప్రచారం చేశారు. మొత్తం పాకిస్తాన్‌లోనే తొలి మెగా పొదుపు దుకాణంగా ఈ మాల్‌కు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేశారు. ఓపెనింగ్ రోజన బట్టలు, వివిధ గృహోపకరణాలను భారీ డిస్కౌంట్లకు అమ్ముతామని మాల్ యాజమాన్యం ప్రకటించింది. ఇదే షాపింగ్ మాల్ లూటీకి కారణం అని చెబుతున్నారు.