వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వలనే బుడమేరుకు గండ్లు పడి కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లు బుడమేరును గాలికొదిలేసిన జగన్.. నేడు ప్రభుత్వంపై బురద చల్లేందుకు వచ్చాడని మండిపడ్డారు. విపత్తుల సమయంలో జగన్ ఏనాడు బాధితుల పక్షాన నిలబడలేదన్నారు. ఐదేళ్ల పదవీకాలంలో సాయంత్రం 5 తరువాత ఒక్క రోజు కూడా జగన్ బయటకు రాలేదన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాహితం కోరాలని తెలిపారు. జగన్ రెడ్డి ఫేక్ ప్రచారం మానుకోవాలని... విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. చంద్రబాబు ఇంటి కోసం బుడమేరు నీరు డైవర్ట్ చేశారని చెప్పడం జగన్ తెలివితక్కువతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితుల కోసం నిలబడిన భగీరదుడు చంద్రబాబు అని అన్నారు. బాధితుల కోసం యంత్రాంగాన్ని, నేతలను, హెలికాఫ్టర్లు, బోట్లు, డ్రోన్లతో యుద్ధప్రాతిపదికన సాహాయ సహకారాలను అందించడం చంద్రబాబు వలనే సాధ్యమైందన్నారు. అమరావతిపై తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడంలో చంద్రబాబు పాత్ర కీలకం కానుందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.