లూలూ గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ తన అభిమానికి ఖరీదైన వాచీని కానుకగా ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేశారు. అభిమానికి ర్యాడో చేతిగడియారం గిఫ్ట్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తైగ వైరల్ అవుతోంది. లూలూ గ్రూప్ ప్రధాన కార్యాలయంలోకి ఆ అభిమాని వెళ్లి.. యూసఫ్ అలీని కలవడం వీడియోలో కనిపిస్తోంది. అలీ ఆఫీసులోకి వెళ్లగానే అతడు అంతరిక్షంలోకి వెళ్లినంత సంతోషానికి గురయ్యాడు. తనను కలవడానికి వచ్చిన వ్యక్తిని కానుక ఇచ్చిన మరింత ఆశ్చర్యానికి గురిచేశాడు లూలూ ఛైర్మన్. ఆయన బహుమతిగా అందజేసిన ఈ వాచీ ధర కనీసం రూ.2 లక్షలు ఉంటుంది.
ఆ వాచ్‌పై ఆయన పేరును సూచించే ‘Y’ అనే అక్షరం ఉంది. కోచి నగరానికి వచ్చిన లూలూ అధినేత.. తన అభిమాని ఎం ఎఫిన్‌ను కలవాలని ఆహ్వానించాడు. అంత గొప్పవ్యక్తి నుంచి పిలుపు రావడంతో ఎఫిన్ అనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎఫిన్‌ను ఎంతో ఆప్యాయంగా పలకరించిన అలీ.. కుశల ప్రశ్నలు వేశాడు. అనంతరం వాచ్‌ను ఇవ్వబోతుంటే ఎఫిన్ వద్దని వారించాడు. అయినాసరే ఆయనే స్వయంగా చేతికి వాచ్‌ను బలవంతంగా అలంకరించాడు.
ఇక, జులై 2024లో యూసుఫ్‌ను కలిసినప్పుడు.. ఆయన తల్లి ఫోటోతో ఉన్న ప్రత్యేకమైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చి ఎఫిన్ ఆశ్చర్యపరిచాడు. ‘మీరు మీ తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నారో మాట్లాడుతున్న వీడియో నేను చూశాను’ అని ఈ సందర్భంగా చెప్పారు. దీనికి లూలూ అధినేత స్పందిస్తూ.. ‘అందరూ తమ తల్లులను ప్రేమిస్తారు.. నాకే కాదు.. ప్రపంచంలో తమ తల్లిని ప్రేమించని వారెవరు?’ అని బదులిచ్చారు.
కేరళలోని త్రిసూర్ జిల్లా నట్టికా గ్రామానికి చెందిన యూసఫ్ అలీ.. లూలూ గ్రూప్ ఇంటర్నేషనల్‌ను స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా హైపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ నిర్వహిస్తున్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆయన సంపద 7.1 బిలియన్ డాలర్లు. ఆసియాలోని అతిపెద్ద రిటైల్ చెయిన్‌లలో ఒకటి అయిన లూలూ సంస్థలో వివిధ దేశాల్లో 65,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలు, ఇతర ప్రాంతాలలో 259 అవుట్‌లెట్‌లతో పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద సంస్థ. భారత్‌లో 7 మాల్స్‌ను నిర్వహిస్తోంది. కోచి, బెంగళూరు, తిరువనంతపురం, పాలక్కడ్, హైదరాబాద్, లక్నోలో ఈ మాల్స్ ఉన్నాయి.