హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. గోసంరక్షణ పేరుతో ఇంటర్ విద్యార్ధి ప్రాణాలు బలితీసుకున్నారు. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడనే అనుమానంతో 12వ తరగతి విద్యార్ధిని కారులో వెంబడించి హత్య చేశారు. దారుణమైన ఈ ఘటన ఫరీదాబాద్‌లో ఆగస్టు 23న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి సంబంధించి గోసంరక్షక బృందానికి చెందిన ఐదుగురిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితులను అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణ, ఆదేశ్, సౌరభ్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
హతుడు ఆర్యన్ మిశ్రా, తన స్నేహితులు శాంకీ, హర్షిత్‌లతో కలిసి వెళ్తుండగా.. ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై గాధ్‌పురి సమీపంలో దాదాపు 30 కిలోమీటర్ల మేర వారిని నిందితులు వెంబడించారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం రెనౌల్ట్ డస్టర్, టయోటా ఫార్చ్యూన్ కార్లలో కొంతమంది స్మగ్లర్లు నగరంలోకి వచ్చినట్టు గో సంరక్షకులకు సమాచారం వచ్చింది. దీంతో డస్టర్ కారులో వెళ్తోన్న ఆర్యన్, అతడి స్నేహితులను వెంబడించి దాడి చేశారు. పటేల్ చౌక్ సమీపంలో కారు ఆపాలని డ్రైవింగ్ సీటులో ఉన్న హర్షిత్‌ను కోరారు. అయితే, వారిని తమ ప్రత్యర్ధులై ఉంటారని భావించి వారు కారు ఆపలేదు. అంతేకాదు, తమను చంపడానికి గూండాలను పంపినట్లు వారు భావించారు.
దీంతో కారులో ఉన్నవారిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో వెనుక సీటులో ఉన్న ఆర్యన్ మెడకు సమీపంలో బుల్లెట్ తగిలింది. కారు ఆపిన తర్వాత కూడా కాల్పులు జరిపారు. కారులో ఇద్దరు మహిళలను చూసిన నిందితులు.. తాము పొరబడ్డామని భావించి అక్కడ నుంచి పరారయ్యారు. గాయపడిన ఆర్యన్‌ను స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. కాల్పులకు వినియోగించిన తుపాకీ కూడా లైసెన్స్ లేదని తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. గో సంరక్షణ పేరుతో అమాయకులపై దుండుగులు దాడులకు పాల్పడిన ఘటనలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం సర్వసాధారణంగా మారాయి. తాజాగా ఘటన కూడా అందులో భాగంగానే జరిగింది.