వాయుసేనకు చెందిన మరో మిగ్ -29 యుద్ధ విమానం కుప్పకూలింది. రాజస్థాన్‌లోని బర్మేర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. జెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. వైమానిక దళానికి యుద్ధ విమానాల పైలట్లకు రాత్రివేళ రోజువారీ శిక్షణలో భాగంగా మిగ్-29ను నడుపుతుండగా ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఓ పైలట్ శిక్షణ పొందుతుండగా ఈ ఫైటర్ జెట్ కూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ సాహసోపేతంగా వ్యవహరించి లోహ విహంగం నుంచి బయటపడ్డాడు. దీంతో అతడి ప్రాణాలు దక్కాయి.
ఈ ఘటన దర్యాప్తునకు వాయుసేన అధికార వర్గాలు ఆదేశాలు జారీ చేశాయి.‘బర్మేర్ సెక్టార్‌లో రాత్రివేళ రోజువారీ శిక్షణలో భాగంగా ఐఏఎఫ్ మిగ్-29 విమానం నడుపుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది.. ఫైటర్ జెట్ కూలిపోవడంతో పైలట్ చాకచక్యంగా బయటపడ్డాడు.. ఎటువంటి ప్రాణాపాయం లేదు.. దీనిపై కోర్టు ఆఫ్ ఎంక్వెయిరీకి ఆదేశించాం’ అని ఎయిర్‌ఫోర్స్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో నివాస ప్రాంతాలకు దూరంగా ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించింది.
కూలిపోయిన వెంటన యుద్ధ విమానం మంటల్లో చెలరేగి కాలిబూడిదయ్యింది. ఘటనా స్థలికి బర్మేర్ కలెక్టర్ నిషాంత్ జైన్, ఎస్పీ నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో అక్కడకు చేరుకోవడం కష్టంగా మారింది. కాగా, తరచూ ప్రమాదాల బారిన పడుతున్న మిగ్ విమానాలను తప్పించాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గతేడాది భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. వాటిని వైమానిక దళం నుంచి తప్పించే ప్రక్రియ.. మొదలుపెట్టామని. 2025 నాటికి పూర్తిగా ఉద్వాసన పలుకుతామని పేర్కొంది.
ఇక, మిగ్ 29 విమానం 1987 నుంచి వైమానిక దళంలో సేవలు అందిస్తున్నాయి. నాటి సోవియట్ యూనియన్ నుంచి ఈ విమానాన్ని భారత్ కొనుగోలు చేసింది. ఈ విమానాన్ని పలుమార్లు నవీకరించారు. విమానంలోని ప్రాథమిక నిర్మాణం మినహా మార్పులు చేర్పులు చేశారు. ఇందులో కొత్త కాక్‌పిట్, నూతన రాడార్, కొత్త ఇంధన ట్యాంక్, కొత్త ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ను మర్చారు. కొత్త క్షిపణులను అమర్చడం ద్వారా దీనికి పూర్తిగా ఆధునిక రూపాన్నిచ్చారు. వేగంగా దాడిచేయగల సామర్ధ్యం ఉన్న మిగ్-29.. కేవలం ఆరు నిమిషాల్లో లక్ష్యన్ని ఛేదించగలదు. ఇక, కార్గిల్ యుద్ధ సమయంలో ఈ విమానం కీలక పాత్ర పోషించింది. రెండు ఇంజిన్లు కలిగి ఉండే ఈ ఫైటర్ జెట్ పాక్ సైన్యాలను హడలెత్తించింది.