పెళ్లి పేరుతో తనను మోసం చేయడమే కాకుండా.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగిపై యువతి కేసు పెట్టింది. దీంతో ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించిన నిందితుడు.. అందుకు లాయర్‌ను సంప్రదించాడు. తాను ఆమెను మోసం చేయలేదని, ఇద్దరం లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని వివరించాడు. అంతేకాదు, సహజీవనం కోసం తమ మధ్య కుదిరిన ఒప్పందం బయటపెట్టిన అతడు... అందులోని ఒక కండిషన్ ప్రకారం తనపై కేసు చెల్లదని పేర్కొనడం గమనార్హం. కానీ, ఆ ఒప్పంద పత్రంపై తాను సంతకం చేయలేదని, అది ఫోర్జరీ చేశాడని సదరు యువతి వాదిస్తోంది. దీంతో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ ఘటన దేశ ఆర్ధిక రాజధాని నగరం ముంబయిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వయోధికులకు సంరక్షకురాలిగా పనిచేస్తోన్న 29 ఏళ్ల యువతి..ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తోన్న 46 ఏళ్ల వ్యక్తితో సహజీవనంలో ఉంది. తనను పెళ్లి చేసుకుంటానని అతడు మోసం చేశాడని, పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఆమె ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై అత్యాచారం, మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. అయితే, నిందితుడు తమ మధ్య కుదిరిన ఒప్పంద పత్రాన్ని బయటపెట్టాడు. అంతేకాదు, తన తరఫున లాయర్‌ను కూడా పెట్టుకున్నాడు. ఇద్దరూ ఓ అవగాహనకు వచ్చిన ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి ఈ కేసు కుట్రపూరితమని అతడి తరఫున లాయర్ వాదించారు. కానీ, ఆ సంతకం తనది కాదని ఆ యువతి వాదించడం గమనార్హం.
లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో ఏడు కండిషన్లు పెట్టుకున్నారు. ఆ అగ్రిమెంట్ నిబందన ప్రకారం.. 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 వరకు కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అలాగే, రిలేషన్‌లో ఉన్నప్పుడు పరస్పరం లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం, కేసులు పెట్టుకోవడం చేయరాదు. మూడో పాయింట్‌గా సహజీవనంలో భాగంగా అతడి ఇంట్లోనే ఆమె ఉండాలి. భాగస్వాముల్లో అవతలి వ్యక్తి వైఖరి నచ్చకపోతే నెల రోజులు ముందు నోటీసు పీరియడ్ ఇచ్చి తర్వాత విడిపోవచ్చు. ఒకవేళ, ఆమె గర్భం దాల్చితే అందుకు తాను బాధ్యుడు కాదని మరో పాయింట్లో రాసుకున్నారు. అలాగే, ఇరువురి తరఫు బంధువుల రాకపోకలపై ఆంక్షలు, మానసిక ప్రశాంతత భంగం వాటిల్లకుండా చూసుకోవడం వంటివి అగ్రిమెంట్‌లో చేర్చారు. దీని నోటరీ కూడా చేయించడం గమనార్హం. ప్రస్తుతం ఈ అగ్రిమెంట్‌పై నెట్టింట చర్చ మొదలైంది.
ఇక, ఈ కేసులో నిందితుడికి ట్రయల్ కోర్టు ముందస్త బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే, ఒప్పందంలోని వాస్తవాలను నిర్దారించాలని, బాధితురాలు ఆరోపిస్తున్నట్టు ఆమె సంతకమేనా? కాదా? అనేది తేల్చాలని పోలసీులకు ఆదేశాలు జారీచేసింది. విచారణ పూర్తిచేసిన తర్వాత పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంత వరకు నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని తెలిపారు.