పుర్రెకో బుద్ది అని పెద్దలు ఊరకనే అనలేదు. కొందరు అత్యుత్సాహంతో వింత పోకడలు ప్రదర్శిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఎలా ఆర్పుతారో చూడాలని.. వారితో సరసాలాడాలని ఉబలాటపడి విపరీత చర్యలకు దిగింది. ఏకంగా రెండుసార్లు వ్యవసాయ పొలానికి నిప్పంటించింది. చివరకు అసలు విషయం బయటపటడంతో జైల్లో ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి నెలకుంది. గ్రీస్‌లో గత నెల చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.
గ్రీస్‌లో ట్రిపోలీ పరిధిలోని కెరిసిటా అనే ప్రాంతంలో ఆగస్టు 24, 25 న వరుసగా ఓ వ్యవసాయ పొలంలో భారీగా మంటలే చెలరేగాయి. ఓవైపు కార్చిచ్చులతో సతమతమవుతుంటే... ఇవి ఎక్కడ ప్రమాదకరంగా మారుతాయోననే ఆందోళనతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు ఆర్పేశారు. అయితే, ఇది ఎలా జరిగింది? అనేది తెలుసుకోడానికి విచారణ చేపట్టడంతో విస్మయానికి గురిచేసే విషయం తెలిసింది. అదృష్ఠవశాత్తూ తక్కువ మొత్తంలో మంటలు వ్యాపించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఫైర్ సిబ్బంది మంటలను ఎలా ఆర్పుతారో చూడాలనే వింత కోరికతో ఓ 44 ఏళ్ల మహిళ ఈ వ్యవసాయ భూమికి నిప్పుపెట్టినట్లు గుర్తించారు. అంతేకాదు.. వచ్చిన ఆ సిబ్బందితో సరసాలాడొచ్చని ఆమె ఆశించింది. ఆమె మోటు సరసం తెలిసి అధికారులు విస్తుపోయారు. ఆమె ఆలోచనలు ఇంత క్రూరంగా ఉండటంతో అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఓ నిప్పంటించిన కేసులో న్యాయమూర్తి ఆమెకు 1000 యూరోలు (1,106 డాలర్లు) జరిమానాతో పాటు మూడేళ్ల సాధారణ జైలు శిక్ష విధించారు.
గ్రీస్‌లో ఇలా ఉద్దేశపూర్వకంగా మంటలు అంటించడం చట్టరీత్యా నేరం. ఎందుకంటే అక్కడ ప్రతి ఏటా కార్చిచ్చు రగిలి.. వేలాది ఎకరాల్లో అడవులు, ఊళ్లకు ఊళ్లు తగలబడిపోతాయి. ఈ ఏడాది ఆగస్టులో చెలరేగిన కార్చిచ్చుతో ఏథెన్స్ నగర శివార్లు మొత్తం భస్మమయ్యాయి. వేలాది మంది పౌరులు నిరాశ్రయులయ్యారు.
రోడ్స్, ఎవియా, కోర్ఫు దీవుల్లోనూ ఇది విజృంభించింది. అక్కడ నుంచి దాదాపు 19 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇది ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్‌గా నిలిచింది.మంటలను అదుపు చేయడానికి యూరోపియన్ యూనియన్‌తోపాటు, తుర్కియే, జోర్డాన్, ఇజ్రాయేల్, క్రొయేషియాల సాయం తీసుకోవాల్సి వచ్చింది.