భారత్‌కు పొరుగున ఉన్న దేశాలు.. ప్రస్తుతం ఏదో ఒక విషయంలో మన దేశంతో ఘర్షణకు దిగుతుండటం తీవ్ర ఆందోళనకరంగా మారింది. పాకిస్తాన్, చైనాలతో మన దేశానికి ఎన్నో ఏళ్లుగా వైరం కొనసాగుతుండగా.. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి చిన్న చిన్న దేశాలు కూడా అప్పుడప్పుడూ భారత్‌ను కవ్విస్తూ లేనిపోని వివాదాలను తెరపైకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఓసారి భారత భూభాగాలను తమ భూభాగాలుగా చూపిస్తూ నేపాల్ ఓ మ్యాప్‌ను విడుదల చేయగా.. దానిపైనే భారత్, నేపాల్ మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. తాజాగా ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఈ వివాదాన్ని మరింత రాజేసింది. భారత్‌లోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ ఉన్న మ్యాప్‌ను ఆ దేశ కరెన్సీపై ముద్రించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
భారత్‌తో ఇప్పటికే ఉన్న భూవివాదాన్ని నేపాల్ సెంట్రల్ బ్యాంక్ మరింత ఆజ్యం పోసేందుకు సిద్ధమైంది. భారత్‌లోని లిపులేక్, కాలాపానీ, లింపియాదూర ప్రాంతాలను ఖాట్మండుకు చెందినవిగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. నేపాల్ సెంట్రల్ బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌లను కూడా కలిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కరెన్సీ ప్రింటింగ్ ప్రక్రియ కూడా మొదలుపెట్టినట్లు నేపాల్ సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధి దిల్‌రామ్ పోఖ్రాల్ చెప్పినట్లు నేపాల్ ఖబర్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇక ఈ కొత్త కరెన్సీ ప్రింటింగ్ పూర్తి కావడానికి 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని దిల్‌రామ్ పోఖ్రాల్ పేర్కొన్నారు. నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ నేతృత్వంలోని నేపాల్ కేబినెట్ సరికొత్త మ్యాప్‌తో కరెన్సీ నోట్లను ముద్రించాలని మే 3వ తేదీన నిర్ణయం తీసుకుంది.
అయితే 2020లో భారత్‌లో ఉన్న లిపులేక్, కాలాపానీ, లింపియాదురా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్ సరికొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ మ్యాప్‌కు అప్పటి కేపీ శర్మ వోలీ ప్రభుత్వం తీర్మానం చేయగా.. ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర కూడా వేసింది. ఈ మ్యాప్‌పై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. వాటిని పట్టించుకోకుండా అప్పటి నుంచి నేపాల్ అధికారిక పత్రాల్లో వాడే మ్యాప్‌లను భారత భూభాగాలతో కలిపి విడుదల చేసిన మ్యాప్‌లను వాడడం మొదలుపెట్టింది. ఇప్పుడు అదే మ్యాప్‌ను నోట్లపై కూడా ప్రింటింగ్ చేస్తామని ప్రకటించడం తాజా వివాదానికి కారణం అయింది.