ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదల్లో ప్రాణనష్టం తగ్గించడంలో విఫలం.. 30 మంది అధికారులకు ఉరిశిక్ష

international |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2024, 11:17 PM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి ప్రపంచం మొత్తం కథలు కథలుగా చెప్పుకుంటోంది. విచిత్రమైన నిబంధనలు, కట్టుబాట్లతో ప్రజల వ్యక్తిగత ఇష్టాయిష్టాలను సైతం ఆయనే నిర్ణయిస్తారు. ఏం తినాలి.. ఎలాంటి బట్టలు వేసుకోవాలని అనేది నియంతే శాసిస్తారు. కఠినమైన ఆంక్షలతో పాటు.. చిన్న చిన్న తప్పిదాలకే దారుణమైన శిక్షలు విధిస్తూ ఉంటారు. ఇటీవల ఉత్తర కొరియాను భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు కిమ్ సిద్ధమయ్యారు. దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలు చేయాలని అధినేత ఆదేశించినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.


 వరదల సమయంలో ప్రాణనష్టాన్ని నివారించడంలో విఫలమయ్యారన్న సాకుతో ఉరితీయడానికి కిమ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం వంటి కారణంతో 20-30 మంది ప్రభుత్వ అధికారులకు గత నెల మరణశిక్ష విధించినట్లు దక్షిణకొరియా మీడియా ఓ కథనం వెలువరించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరికి శిక్షను అమలు చేసినట్లు తెలిసిందని అందులో పేర్కొంది. అయితే, ఉరిశిక్షల అమలు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఆ అధికారులు ఎవరన్న వివరాలు కూడా బయటకు రాలేదు.


కానీ, ఈ శిక్ష పడినవారిలో చాగాంగ్‌ ప్రావిన్స్‌ ప్రొవిన్షియల్‌ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్‌ బాంగ్ హూన్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వరదల సమయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసిన కిమ్‌ .. హూన్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనకు శిక్ష పడి ఉండొచ్చని సదరు కథనాలు అభిప్రాయపడ్డాయి. జులై-ఆగస్టు మధ్య ఉత్తరకొరియాలో కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరదలు, కొండచరియలు విరిగిపడి అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి.


ఈ విపత్తులో దాదాపు 4 వేలకుపైగా నివాసాలు ధ్వంసం కాగా... వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 1,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి.. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సహా 15,400 మంది బాధితులను శిబిరాలకు తరలించింది. విపత్తు సమయంలో స్వయంగా రంగంలోకి దిగిన కిమ్‌... వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మోకాలిలోతు నీటిలో కిమ్‌ కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లడం.. బోటులో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే, వరదల్లో భారీ ప్రాణనష్టం జరిగిందనే ప్రచారాన్ని కిమ్ ఖండించడం గమనార్హం. అంతర్జాతీయంగా తమ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన కొట్టిపారేశారు.


ఉత్తర కొరియా మాజీ దౌత్యవేత్త లీ ఇల్-గ్యూ మాట్లాడుతూ.. ‘ఇటీవలి వరద నష్టం జరిగినప్పటికీ వారు సామాజిక భద్రతా కారణాల వల్ల బయటపెట్టరు.. ఎక్కడ తమను ఉరేస్తారోనని అధికారులు భయంతో ఉంటారు’ అని చెప్పారు. కాగా, కిమ్‌ జమానాలో ఇలాంటి శిక్షలు సర్వసాధారణం. 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో చర్చలను సరిగా సమన్వయం చేయనందుకు గానూ ఉత్తరకొరియా అణు రాయబారి కిమ్‌ హోక్‌ చోల్‌కు మరణదండన అమలు చేశారు. కోవిడ్-19 తర్వాత ఉత్తర కొరియాలో మరణ దండనలు నాటకీయంగా పెరుగుతున్నాయి. మహమ్మారికి ముందు ఏడాదికి సగటున 10 మందికి మరణ శిక్ష విధించేవారు. కానీ, ప్రస్తుతం అది 10 రెట్లు అధికంగా చోటుచేసుకుంటున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com