సొంత పార్టీ ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశారంటూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మీ టీడీపీ అధినేతకు లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె.. తాను సత్యేవేడు జిల్లాకు మహిళా అధ్యక్షురాలుగా పని చేస్తున్నానని, పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు పాత్ర పోషించానని వరలక్ష్మీ చెప్పుకొచ్చారు.అయితే గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు వ్యతిరేకంగా తాను ఎన్నో పోరాటాలు చేశానని, అయితే ఆయన్నే టీడీపీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడాన్ని తనతో పాటు, టీడీపీ క్యాడర్ కూడా వ్యతిరేకించిందని జిల్లా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మీ తెలిపారు. అయినప్పటికి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు టీడీపీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా , కోనేటి ఆదిమూలం గెలుపు కోసం తాను కృషి చేశానని ఆమె పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై కక్షగట్టి , అసభ్యకరంగా ప్రవర్తిస్తూ , తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారని వరలక్ష్మీ తన లేఖలో పేర్కొన్నారు.