గోదావరి వరదలు పెరుగుతున్నాయి. మరోపక్క భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. తస్మాత్‌జాగ్రత్త! అని రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి వివిధ విభాగాల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ను కలెక్టర్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి జేసీ చిన్నరాముడు, డీఆర్వో జి.నరసింహులు, కేఆర్‌ఆర్‌సీఎస్ డీసీ ఆర్.కృష్ణనాయక్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి వరదలు పెరుగుతున్నాయని, లంకల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. భారీవర్షాల నేపథ్యంలో ముంపుబారిన పడే ప్రాంతాల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల చర్యలపై ముందస్తు కార్యాచరణతో అధికారు లు సిద్ధంగా ఉండాలన్నారు. బుధవారం ఉదయం నుంచి రాజమహేంద్రవరం, రూరల్, కడియం, పెరవలి, తాళ్లపూడి మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్‌రూంలో సిబ్బంది అందరూ రిపోర్టు చేయాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా ఆక్రమణల వల్ల ముంపు వాటిల్లిందని తెలిస్తే సంబంధిత అధికారులనే బాధ్యు లుగా చేస్తానని హెచ్చరించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైందని, ధవళేశ్వ రం వద్దకు భారీగా వరద నీరు చేరే అవకాశం ఉన్న దృ ష్ట్యా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రాజమహేంద్రవరం ఆర్డీవో, కొవ్వూరు సబ్‌కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్నారు. సూరంపాలెం, కొవ్వాడ, ఎర్రకాలువ, ధవళేశ్వరం బ్యారేజ్ ప్రాంతాల్లో గండ్లు పడే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునరవాస కేంద్రాలు, ముంపుప్రాంతాలలో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రణాళికలో భాగంగా ముందస్తు చర్యల కోసం ఒక నెలకు సరిపడే నిత్యావసరాలు సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా నిషేధం విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బందికి ఎటువంటి సెలవులు ఇవ్వవద్దని, 24/7 అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే డ్రోన్ సర్వే ద్వారా గుర్తించిన ముంపు ప్రాంతాల్లో పరిస్థి తులు అంచనా వేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఉన్నారు.