క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఏ మాత్రం తీసిపోని కథ ఇది. ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు, విస్తుపోయేలా చేసే వాస్తవాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. నమ్మకం, మోసం, నయవంచన, రక్తపాతం ఇలా ప్రతిదీ ఇందులో ఉంది. గుంటూరులో జరుగుతున్న వరుస హత్యలపై పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైన ఈ భయంకరమైన నిజాలు.. సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అంతేకాదు.. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదోనని జనం భయపడిపోయేలా చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో వరుసగా హత్యలు జరుగుతున్నాయి. దీనిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. దర్యాప్తు జరిపితే దీని వెనుక ఉన్నది ఓ ముఠా అని తేలింది.. అది కూడా మహిళలు. దీంతో పోలీసులే విస్తుపోయే పరిస్థితి.
ప్రదేశం తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీ.. సమయం 2024 జూన్.. రజిని అనే మహిళ ఓ ఆటోను బాడుగకు తీసుకుంది. ఆ ఆటోలో రజినితో పాటు నాగూర్ బీ అనే మహిళ ఎక్కింది. వీరి వెనుకనే బైక్ మీద వెంకటేశ్వరి అనే మహిళ వీరిని ఫాలో అవుతూ వచ్చింది. దారి మధ్యలో రజినీ.. ఆటో డ్రైవర్ చేత బ్రీజర్ కొనిపించింది. ఆటో వడ్లమూడిలోని నిర్మానుష్య ప్రాంతానికి రాగానే.. రజినీ, నాగూర్ బీ ఆటో దిగేశారు. ఆ తర్వాత రజినీ, నాగూర్ బీ, వెంకటేశ్వరి బ్రీజర్ తాగారు. అయితే నాగూర్ బీ తాగిన బ్రీజర్‌లో రజిని, వెంకటేశ్వరి సైనైడ్ కలిపారు. ఇది తెలియని నాగూర్ బీ.. బ్రీజర్ తాగి చనిపోయింది. ఆ తర్వాత రజినీ, వెంకటేశ్వరి కలిసి నాగూర్ బీ ఒంటిపై ఉన్న నగలను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు.
అయితే నాగూర్ బీ మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఆటో డ్రైవర్‌ను విచారించారు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా రజినీని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే వీరి వ్యవహారం బయటపడింది.అప్పులు తీసుకుని వాటిని ఎగ్గొట్టేందుకు, అలాగే డబ్బులు, నగల కోసం ఇలా సైనైడ్ ఇచ్చి హత్యలు చేస్తున్నట్లు తేల్చారు. ఈ రకంగా ఇప్పటి వరకూ నలుగురిని హత్య చేశారని.. మరో ముగ్గురిని చంపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
2022లో మార్కాపురానికి చెందిన సుబ్బలక్ష్మిని ఆస్తి. డబ్బుల కోసం ఇలాగే సైనైడ్ కలిపి ఇచ్చి చంపారు. అయితే సుబ్బలక్ష్మి నిందితురాల్లో ఒకరైన వెంకటేశ్వరికి అత్త కావడం గమనార్హం. 2023లో 20 వేల రూపాయలు అప్పు ఎగ్గొట్టేందుకు నాగమ్మ అనే మహిళను కూల్‌డ్రింక్‌లో సైనేడ్ కలిపి హతమార్చారు. ఇదే రకంగా తెనాలికి చెందిన ఓ వ్యక్తిని కూడా వీరు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ నాలుగు హత్యలే కాకుండా మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. తినే ఆహారం, తాగే పానీయాల్లో సైనైడ్ కలిపి హత్యలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 2022 నుంచి ఈ మహిళల ముఠా ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు గుంటూరు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలోని ముగ్గురిని అరెస్ట్ చేశామని.. మరికొంతమంది పరారీలో ఉన్నట్లు గుంటూరు ఎస్పీ తెలిపారు. వీరికి సైనైడ్ ఇస్తున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న వారిని అరెస్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. మొత్తంగా ఈ వ్యవహారం గుంటూరులో కలకలం రేపింది.