లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే్ కోనేటి ఆదిమూలం మీద కేసు నమోదైంది. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో కోనేటి ఆదిమూలం మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను బెదిరించి, తనపై అత్యాచారం చేశారంటూ గురువారం ఓ మహిళ ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు సైతం బయటపెట్టారు. తన భర్తతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించిన బాధితురాలు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో తనపై అఘాయిత్యం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీసులు కోనేటి ఆదిమూలం మీద కేసు నమోదు చేశారు.
మరోవైపు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక్లలో టీడీపీ తరుఫున కోనేటి ఆదిమూలం గెలుపొందారు. అయితే కోనేటి ఆదిమూలం తనను బెదిరించి లొంగదీసుకున్నారంటూ అదే నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా నాయకురాలు గురువారం ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో భర్తతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రైవేట్ వీడియోలను మీడియాకు విడుదల చేశారు. తన కోరిక తీర్చకుంటే కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించి తనను లొంగదీసుకున్నారంటూ బాధితురాలు ఆరోపించారు. కోనేటి ఆదిమూలం వ్యవహారం అందరికీ తెలియాలనే పెన్ కెమెరాతో రికార్డు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యవహారం గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కు సైతం లేఖరాసినట్లు చెప్పుకొచ్చారు.
మరోవైపు కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. అధినేత నిర్ణయం మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని కోనేటి ఆదిమూలం చెప్తున్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే వైసీపీ ఇలాంటి కుట్రలు చేస్తోందంటున్నారు. పార్టీ ఆదేశాలను పాటిస్తానని చెప్పారు. మరోవైపు తాజాగా ఆయనపై తిరుపతిలో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి.