తిరుమలలో మరో అక్రమ దందా బయటపడింది. కొండపై ఉన్న సబ్ రిజిస్ట్రార్ వివాహ నమోదు కార్యాలయంలో.. వివాహ ధ్రువపత్రం ఇచ్చేందుకు కార్యాలయ సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారని వ్యవహారం కలకలంరేపింది. కొందరు బాధితులు నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో స్థానిక కల్యాణ వేదికలో పేద కుటుంబాలు వివాహం చేసుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వివాహం చేసుకున్న వధూవరులకు అక్కడే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అందించేందుకు వీలుగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మ్యారేజ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
మ్యారేజ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఎస్.హేమంత్ యాదవ్.. మరో ఇద్దరు సిబ్బంది నూతన వధూవరుల కుటుంబాల నుంచి సర్టిఫికెట్ కోసం రూ.2500 చొప్పున వసూలు చేస్తున్నట్లు కొందరు ఆరోపించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.500 వసూలు చేయాలి.. కానీ అక్కడి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అందుకు తగిన రసీదులు ఇవ్వడం లేదని.. వివాహం చేసుకున్న నూతన దంపతులు సుమన్, భాగ్యలక్ష్మి ఆరోపించారు. ఈ అక్రమ వసూళ్లకు సంబంధించి సమాచారం రావడంతో టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు.అక్కడ ఉద్యోగి ఎస్.హేమంత్‌యాదవ్ దగ్గర తనిఖీ చేయగా.. ఆయన దగ్గర అదనపు నగదు, సిగరెట్ ప్యాకెట్లు దొరికాయి. ఈ వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తమ ఇష్టదైవమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని భావిస్తుంటారు. తిరుమలలో వీరి కోసం కళ్యాణ మండపాలు ఉంటాయి.. ముందుగానే దరఖాస్తు చేసుకుంటే అక్కడ వివాహం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు వరుడు, వధువుకు సంబంధించిన వివరాలతో పాటుగా అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంది. అక్కడ వివాహం తర్వాత మ్యారేజ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నట్లు సర్టిఫికేట్ అందజేస్తారు. దీని కోసమే అక్కడ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఈ వసూళ్ల వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.