భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. దాంతో, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లోని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలకు సోమవారం నాడు సెలవు ప్రకటించినట్టు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అల్లూరి జిల్లా కలెక్టర్ కూడా విద్యాసంస్థలకు సెలవుపై స్పందించారు. జిల్లాకు భారీ వర్షసూచన ఉందని తెలిపారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వాగులు, కాలువలు దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు.కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది.