ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా భారీ నష్టం వాటిల్లింది. వరద ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో జరిగిన నష్టం వెలుగు చూస్తోంది. ఏపీలో వరద నష్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారమే రూ. 6,882 కోట్ల మేర నష్టం వాటిళ్లినట్లు కేంద్రానికి ఏపీ నివేదిక అందజేసింది. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ కొనసాగుతోంది. వరదలు, వర్షాల కారణంగా ఇప్పటికే 46 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇక వ్యవసాయ, ఆస్తి నష్టం అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రతి ఇంటికీ జరిగిన డ్యామేజీని లెక్కేస్తే భారీగా వరద నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 4.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. 49 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. 200 ఎకరాల్లో సెరీకల్చర్‌కు నష్టం జరిగింది. ఏపీలో మొత్తంగా 5,921 కిలోమీటర్ల మేర రహదారులు డ్యామేజీ అవగా.. 4,203 కిలో మీటర్ల మేర స్టేట్ హైవేస్ దెబ్బతిన్నాయి. పంచాయతీల పరిధిలో 1,160 కిలో మీటర్లు, పట్టణాల పరిధిలో 558 కిలో మీటర్ల మేర రోడ్లు డ్యామేజీ అయ్యాయి. 540 పశువులు మృత్యువాత పడ్డాయి. 11 కేవీ లైన్లు, ఎల్టీ లైన్లు కిలో మీటర్ల మేర దెబ్బతిన్నాయి. 76 సబ్ స్టేషన్లు ముంపు బారిన పడ్డాయి. 1,283 ఎల్టీ ఎలక్ట్రిక్ పోల్స్, 1,668 11 కేవీ ఎలక్ట్రిక్ పోల్స్ వరదలకు దెబ్బతిన్నాయి. బుడమేరు సహా వివిధ ప్రాంతాల్లో భారీ గండ్లు పడ్డాయి. మొత్తంగా 405 చోట్ల కాల్వలకు, చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు గుర్తించారు.