బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరైంది. శనివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో నదులు, వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బలిమెల డ్యామ్ వద్ద ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఏకంగా 30 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. గోవిందపురం (విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం)లో 14, కృష్ణదేవిపేట (అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం), చింతపల్లి(అల్లూరి జిల్లా)లో 13, ముంచంగిపుట్టు(అల్లూరి జిల్లా), పెదనడిపల్లి(చీపురుపల్లి)లో 12, కాకరపాడు(అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం), రణస్థలంలో 11, పూసపాటిరేగ, భీమిలి, బొండపల్లి, బలిఘట్టంలలో 10, మెరకముడిదాం, చీపురుపల్లి, విశాఖపట్నం, గరివిడి, గంపరాయి, నర్సీపట్నం, ఎస్.రాయవరంలలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.