ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలోనూ ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఖండ్రిక సమీపంలో నున్న - నూజివీడు రహదారి చుట్టుపక్కల ఇప్పటికీ వరద నీరు ఉంది. 61, 62, 63, 64 డివిజన్లలో వరద నీటిని బయటకు పంపేందుకు ఉన్న అన్ని మార్గాలపై అర్థరాత్రి మంత్రి అధికారులతో చర్చలు జరిపారు. వెంటనే 10 జేసీబీలు రప్పించి రోడ్డును తవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్డును మూడు చోట్ల తవ్వడం ద్వారా వరద నీరు బయటకు పంపేలా ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నీరు ఇప్పటికీ నిల్వ ఉందన్నారు. ఖండ్రిక చుట్టుపక్కల నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేశామని,10 జేసీబీల ద్వారా రోడ్లకు గండి పెట్టి నీటిని బయటకు పంపిస్తున్నామన్నారు. ఇక్కడ నీరు బయటికి వెళ్తే నగరంలో ఉన్న వరద నీరు మొత్తం తగ్గిపోతుందన్నారు. మంగళవారం సాయంత్రానికల్లా మొత్తం నీరు తగ్గిపోయేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.