నిన్నటి వరకు వరద నీటిలో నానిన విజయవాడలోని ముంపు ప్రాంతాలన్నీ కుదుటపడ్డాయి. బుడమేరు ఇన్‌ఫ్లో రెండు వేల క్యూసెక్కుల లోపే ఉండటం.. ఎగువ ప్రాంతాల్లో పెద్దగా వర్షం పడే అవకాశాలు లేకపోవడంతో విజయవాడకు ముప్పు దాదాపు తప్పినట్లే! మరోవైపు బుడమేరు డైవర్షన్ చానల్ గండ్లు పూడ్చివేసిన అధికారులు సోమవారం కట్టను బలోపేతంచేసి గండ్లు పూడ్చిన ప్రాంతాల్లో సీపేజీని అరికట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మంగళవారం నాటికి ఈ పనులు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సీపేజీ నివారణకు జియో టెక్సటైల్ మెటీరియల్ వినియోగిస్తున్నారు. తొలుత గండ్లు పడిన రెండు ప్రాంతాల్లో సీపేజీ 500 క్యూసెక్కులు ఉండగా అది సోమవారం నాటికి 200 క్యూసెక్కులకు తగ్గింది. మంగళవారం నాటికి పూర్తిగా తగ్గిపోతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కట్ట పటిష్ఠతను పెంచేందుకు గండ్లుపడిన చోట 5.7 మీటర్ల ఎత్తును... మరో 0.3 మీటర్ల ఎత్తుకు పెంచుతున్నారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల్లో సుమారు 300 మంది నిమగ్నమయ్యారు.