సరిగ్గా ఏడాది కిందట జగన్ ప్రభు త్వం నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపించినప్పుడు ప్రజలు నా కోసం పోరాటం చేశారు. ఈ రోజు వారికి కష్టం వస్తే వరద ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడానికి నేను యుద్ధం చేస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవా రం 9వ రోజు కూడా విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. సింగ్ నగర్ ఫ్లై ఓవర్ వద్ద మాట్లాడారు. ‘ఆ రోజు నన్ను ప్రభుత్వం బస్సులో నుం చి దించి జైలుకు పంపింది. ఈ రోజు అదే బస్సులో కూర్చుని ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఆ రోజు నా కోసం 80 దేశాల్లో తెలుగువారు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. నాకు అండగా నిలిచారు. నేను కూడా అదే స్థాయిలో నిలిచి పనిచేస్తున్నాను’ అన్నారు. ‘వరద నీటిలో కొందరు 7 రోజులు.. మరికొందరు 9 రోజులు ఉం డాల్సి రావడం మహా విషాదం. గత ప్రభుత్వం బుడమేరుకు పడిన గండ్లను పట్టించుకోలేదు. బుడమేరును ఆక్రమించుకుంటే వదిలేశారు. తామూ కొన్ని ఆక్రమించి అమ్ముకున్నారు. వీటిన్నింటి వల్ల రెండున్నర లక్షల కుటుంబాలు యాతనలు పడా ల్సి వచ్చింది. మేం ఎన్ని చేయాలో అన్నీ చేశాం. చివరి వ్యక్తి వరకు సాయం అందించాలని ప్రయత్నించాం. నేను స్వయంగా తిరిగితే సరిగ్గా విషయం తెలుస్తుందని ప్రతి రోజూ ముంపు ప్రాంతంలో తిరిగాను. రేషన్ ఇచ్చినా ఈ రోజూ ఆహార ప్యాకె ట్లు సరఫరా చేశాం’ అని వెల్లడించారు. ‘బట్టలన్నీ తడిచిపోయాయని ఇవాళ చెప్పా రు. బాధితులందరికీ ఇంటికో జత బట్టలు ఉచితంగా ఇవ్వాలని ఆదేశించా. ఇళ్లలో ఎలక్ర్టికల్; ప్లంబింగ్, కార్పెంటరీ, పెయింటింగ్ వంటి పనులు, రిపేర్ల బాధ్యత అర్బన్ కంపెనీకి అప్పగించాం. ఫోన్ చేస్తే ఆ కంపెనీ నుంచి వచ్చి రిపేర్లు చేస్తారు. ఉద్యోగులను ఇంటింటికీ పంపి అర్బన్ కంపెనీ యాప్ ఎలా వాడాలో శిక్షణ ఇప్పిస్తున్నాం. వాహనాల రిపేర్లను ఆరేడు ప్రదేశాల్లో చేయించాలనుకుంటున్నాం. బీమా లేని వాహనాల రిపేర్లు ఎలా అన్నది ఆలోచిస్తున్నాం. ప్రజలు చాలా నష్టపోయారు. కానీ అన్నీ ప్రభుత్వం చేయలేదు’ అన్నారు.