ఏపీలో వరదలు అతలాతలం చేస్తే, కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి విజయవాడ రైల్వే డివిజన్ ద్వారా ఏడాది రూ.6 వేల కోట్ల ఆదాయం వస్తుంది. రైల్వే శాఖ సరఫరా చేసే 'రైల్ నీర్' (తాగునీరు) ప్లాంట్ మా విశాఖపట్నంలోనే ఉంది. మన విజయవాడ డివిజన్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంటే వరద బాధితులకు కనీసం మంచినీరు అందించడానికి కూడా కేంద్రం ముందుకు రావడంలేదు. వరద బాధితులకు రైల్ నీర్ వాటర్ బాటిళ్లు ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ తరఫున నేను లేఖ రాసినా పట్టించుకోలేదు. సంవత్సరానికి రూ.6 వేల కోట్ల ఆదాయం అందిస్తున్న ప్రజలు ఇంతటి ఘోర విపత్తుతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే మోదీ ప్రభుత్వం ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతోంది? రాష్ట్ర ప్రజల పట్ల కేంద్రం ఇంత దారుణ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంటే చంద్రబాబు ఇంకా మోదీకి ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు?" అని షర్మిల విమర్శించారు.చంద్రబాబు చిన్న పిల్లల దగ్గర కాదు డబ్బులు తీసుకోవాల్సింది. బీజేపీ నుంచి ముక్కుపిండి డబ్బులు తీసుకోవాలి. గత 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు మోదీకి ఊడిగం చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. చంద్రబాబు చిన్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. చిన్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం మాని బీజేపీ నుంచి రూ.10వేల కోట్లు తీసుకుని రావాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను. మిత్రధర్మంలో ముచ్చట్లు కాదు, నిధులు కావాలి" అని షర్మిల స్పష్టం చేశారు.