వినాయక చవితి వేళ కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారికి తీపికబురు అందింది. కాణిపాకం దేవస్ధానానికి ఐఎస్‌వో 9001 : 2015 సర్టిఫికెట్‌ను ఐఎస్‌వో సంస్థ ప్రతినిధి శివయ్య అందజేశారు. శనివారం ఉదయం వినాయక చవిత పర్వదినం రోజు కాణిపాకం దేవస్ధానంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్, కాణిపాకం దేవస్ధానం ఈవో గురుప్రసాద్‌కి ఈ సర్టిఫికెట్‌ను అందజేశారు. కాణిపాకం దేవస్థానంలో నాణ్యమైన పాలన, పారిశుధ్యం, అన్నదాన వితరణ సక్రమంగా నిర్వహిస్తునందుకు ఈ సర్టిఫికేట్ అందజేసినట్లు ఐఎస్‌వో ప్రతినిధి శివయ్య తెలిపారు.
మరోవైపు కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయ స్వామి వారి దేవస్థానం నిత్య అన్నదానానికి భక్తులు కూరగాయలు అందజేయుటకు టయోటా వాహనం, సుమారు 2.5 టన్నులు వివిధ రకాల కూరగాయలను అందజేశారు. వాహనం విలువ రూ. 12 లక్షలు కాగా.. ఈ వాహనాన్ని దేవస్థానం నిత్య అన్నదానానికి పలమనేరుకు చెందిన శ్రీవారి సేవకులు రవీంద్రారెడ్డి, మోహన్ రెడ్డి, జైల్ సింగ్, వారి స్నేహితులు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవస్థానం ఈవో గురు ప్రసాద్‌లకు తాళాలు అందజేశారు. అంతకముందు నిత్య అన్నదాన సత్రంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భక్తులకు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ భక్తులకు అన్నదాన వితరణ చేశారు.
కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి నిత్య అన్నదానం ట్రస్ట్‌కి భక్తుడు విరాళం అందజేశారు. బంగారుపాళ్యం మండలం కొత్త వెంకటాపురంనకు చెందిన పారిశ్రామికవేత్త ఆర్ మోహన్ నాయుడు.. రూ.1,11,116 చెక్కును పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవస్థానం ఈవో గురు ప్రసాద్‌కు అందజేశారు. మరోవైపు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.. భక్తుల రద్దీ కూడా బాగా పెరిగింది. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ ఏర్పాట్లు చేశారు. కాణిపాకం వినాయకుని బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 7వ నుంచి ప్రారంభమై 21 రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబర్16న సాయంత్రం ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, రాత్రి జరిగే ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సెప్టెంబర్ 27న జరుగనున్న తెప్పోత్సవంతో ప్రత్యేక ఉత్సవాలు ముగుస్తాయి.