వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. ఇక వేల మంది ఆహారం, తాగునీరు, ఇల్లు లేక నిరాశ్రయులయ్యారు. రెండు నెలల క్రితం కేరళలో చోటు చేసుకున్న ఆ ప్రకృతి విపత్తు కారణంగా ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. ఊర్లకు ఊర్లే కొట్టుకుపోవడం దేశం మొత్తాన్ని తీవ్రంగా కలిచి వేసింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బిజినెస్‌మెన్‌లు, ఇతర ప్రముఖులు.. తమ వంతుగా వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన ఘటనలో బాధితులుగా మారిన వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు విరాళాలు ప్రకటించారు. అయితే ఆర్థిక సహయం ప్రకటించిన కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. వాటిని ఇవ్వడంలో మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో కేవలం సగం మంది మాత్రమే విరాళాలు ప్రకటించగా.. మరో సగం మంది మాత్రం డబ్బులు ఇవ్వడం లేదు.
వయనాడ్ బాధితులకు అండగా ఉండేందుకు.. కేరళ ప్రభుత్వ ఉద్యోగులు తమ 5 రోజుల జీతాన్ని స్వచ్ఛందంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇలా ఉద్యోగులు 5 రోజుల జీతం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వడం వల్ల రూ.500 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరుతాయని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా కేరళ ప్రభుత్వానికి, వయనాడ్ వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగులు ఊహించని షాక్ ఇచ్చారు. సగం మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రాగా.. మిగిలిన వారు మాత్రం డబ్బులు ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు.
కేరళలో మొత్తం 5,32,207 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వారంతా 5 రోజుల తమ జీతాలను విరాళాలుగా ఇస్తే రూ. 500 కోట్లు వస్తాయని పినరయి విజయన్ సర్కార్ అంచనా వేసింది. అయితే 48 శాతం ఉద్యోగులు తమ జీతాలను ఇచ్చేందుకు ముందుకు రాలేదు. మిగిలిన 52 శాతం మంది ఉద్యోగులు మాత్రమే తమ జీతాలను విరాళాలుగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే తమ జీతాలను విరాళాలుగా ఇస్తున్నట్లు ఉద్యోగులు సెప్టెంబర్ 5వ తేదీ వరకు అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉండగా.. సగం ఉద్యోగులు మాత్రమే ఇచ్చారు.
అయితే విరాళాలు ఇవ్వని ఉద్యోగుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయవద్దని ప్రభుత్వం సూచించింది. ఉద్యోగులు 5 రోజుల వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆదేశించింది. ఇక వారంతా ఒక అంగీకార పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం ఒకేసారి కానీ.. 3 ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లించుకునే అవకాశం కల్పించారు. 5రోజుల కంటే ఎక్కువ విరాళాలు ఇవ్వాలనుకుంటే 10 ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.