ఉచిత ఇసుక విధానం అమలులో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వినియోగదారులు ఉచిత ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా బుధవారం నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్ ఏర్పాటు చేసింది. ఏపీ శాండ్ పోర్టల్ పేరిట నిర్వహించే సైట్ ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. సైట్ నిర్వాహకులు, ఫిర్యాదులు స్వీకరించేవారికి శిక్షణ కార్యక్రమాలు కొలిక్కి వస్తున్నాయి. పోర్టల్ పరీక్ష దశలోనే బుధవారం నుంచి ఆన్‌లైన్ బుకింగ్ చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి ఐదారు రోజులు పట్టొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. దీంతోపాటు ఇసుక రవాణా, డెలివరీ వంటి అంశాలను వాస్తవిక సమయంలో పర్యవేక్షించేలా ప్రత్యేక విధానం అమల్లోకి రానుంది. అయితే, ఇసుక రవాణా చార్జీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. జిల్లాస్థాయి ఇసుక కమిటీలు ప్రతిపాదించిన రేట్లు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. జగన్ ప్రభుత్వ హయాంలో 2021లో నిర్ణయించిన ధరలపై 30-50 శాతం మేర రవాణా చార్జీలు పెంచేలా అధికారుల ప్రతిపాదనలున్నాయి. ఆ ధరలు వద్దని సర్కారు స్పష్టం చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రం అంతా ఒకేవిధంగా రవాణా చార్జీలు ఉండాలని, ఈ దిశగా కలెక్టర్లు, జిల్లా ఇసుక కమిటీలతో చర్చించాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా గత పాలసీ (2021)తో పోలిస్తే రవాణా చార్జీల పెరుగుదల ఐదు శాతానికి మించకుండా ఉండేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వమే చార్జీల పెంపుదల విషయంలో ఓ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 4.5 టన్నుల ఇసుక ట్రాక్టర్‌కు తొలి పది కిలోమీటర్లకు రూ.547 చార్జీ వసూలు చేసేలా ప్రతిపాదించారు. అయితే, ఇవి ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయు. ప్రభుత్వం నిర్ధేశించిన స్థాయిలో కలెక్టర్లు చార్జీలను నిర్ణయించలేకపోతే వీటినే ఆమోదించే అవకాశం ఉందని తెలిసింది.