గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేశ్ ను జగన్ కలవడం పట్ల కూటమి మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇదే అంశంపై స్పందించారు. ఇవాళ ఒక నేరస్తుడ్ని మరో నేరస్తుడు కలిశారని, వారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారని నిమ్మల సెటైర్ విసిరారు. ఈ రాష్ట్రం కష్టాల గురించి కానీ, ప్రజల ఇబ్బందుల గురించి కానీ కనీస సమయం కేటాయించేందుకు ఆ నేరస్తులకు తీరికలేదని విమర్శించారు. జైల్లో ఉన్న ముద్దాయిని కలిసేందుకు రావడమే కాకుండా, జైలు బయటికి వచ్చి బుడమేరుపై అబద్ధాలు వల్లెవేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. ఆ రోజు ఒక్క చాన్స్ అని ప్రజలను ఏమార్చి, ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదను ఏవిధంగా అయితే లూటీ చేశాడో, మళ్లీ ఇవాళ అదే తరహాలో అసత్యాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. విజయవాడను ముంచేసిన బుడమేరు పాపం నీది కాదా? అని జగన్ మోహన్ రెడ్డిని సూటిగా అడుతున్నా. బుడమేరుకు సంబంధించి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా నదికి 11 కిలోమీటర్ల వరకు డైవర్షన్ చానల్ ఉంది. ఇలాంటి ఆకస్మిక వరదలు వస్తాయన్న ఆలోచనతో... 5 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ఆ డైవర్షన్ చానల్ ను 37,500 క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి విస్తరించడానికి, లైనింగ్ చేయడానికి 2014లో చంద్రబాబు టెండర్లు పిలిచారు. రూ.464 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. మిగిలిన పనులు చేయడానికి రూ.206 కోట్లకు జీవో ఇచ్చి, పనులు కేటాయించాం. 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ బుడమేరు డైవర్షన్ చానల్ కు సంబంధించి ఒక్క అర్ధ రూపాయి పని ఎందుకు చేయలేదు? ఐదేళ్ల పాలనలో ఒక్క తట్ట మట్టి కూడా ఎందుకు వేయలేదు? నువ్వు కొత్తగా నిధులు తీసుకురానక్కర్లేదు... మిగిలిన పనులు ఎందుకు చేయలేకపోయావు? బుడమేరు డైవర్షన్ చానల్ పనులను చంద్రబాబు 80 శాతం చేశారు. ఆ మిగిలిన పనులను నీ ఐదేళ్ల పాలనలో పూర్తి చేసి ఉంటే, ముఖ్యంగా ఆ లైనింగ్ పూర్తయ్యుంటే ఇవాళ బుడమేరుకు గండ్లు పడి ఉండేవి కావు కదా! ఇవాళ విజయవాడ నగరం మునిగి ఉండేది కాదు కదా! ఈ విధంగా విజయవాడను నీ చేతగానితనంతో ముంచేసిన పాపం నీది కాదా? మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఇవాళ బుడమేరు గురించి మాట్లాడుతున్నావు?" అంటూ జగన్ పై ధ్వజమెత్తారు.