సరిహద్దుల్లో మరోసారి దాయాది కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బుధవారం తెల్లవారుజామున జమ్మూ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు చెందిన జవాన్ ఒకరు గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని, పాక్‌వైపు నుంచి ఎంత మంది గాయపడ్డారనేది తక్షణమే తెలియరాలేదని పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో పాకిస్థాన్ రేంజర్లు.. అఖ్నూర్‌లో ప్రాంతంలో భారత పోస్ట్‌లపై కాల్పులు జరిపారని చెప్పారు.
‘బుధవారం తెల్లవారుజామున 2.35 గంటల ప్రాంతంలో అఖ్నూర్ ప్రాంతంలోని సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడింది.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ పోస్ట్‌లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది.. ఈ చర్యలకు బీఎస్ఎఫ్ దీటుగానే బదులిచ్చింది.. పాక్ కాల్పుల్లో ఓ జవాన్ గాయపడ్డారు’ అని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. కాల్పుల ఘటనతో అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయని తెలిపారు.
ఇక, 2021 ఫిబ్రవరి 25 భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్దరణ తర్వాత ఇరు దేశాల మధ్య చాలా అరుదుగా ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. గతేడాది రాంబన్ సెక్టార్‌లో పాకిస్థాన్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు అమరడయ్యాడు. మూడేళ్ల తర్వాత పాక్ కాల్పుల్లో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. గతేడాది పాక్ దాడులకు పాల్పడటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బంకర్లను ఆశ్రయించారు. జమ్మూ కశ్మీర్‌లోని ఆర్నియా ప్రాంతంలో కొన్నాళ్లుగా ఉపయోగంలో లేని బంకర్లను శుభ్రం చేసుకున్నారు. ఏ క్షణమైనా తమ నివాసాలపై షెల్లింగ్ జరిగే ప్రమాదం పొంచి ఉందని భావించే స్థానికులు.. బంకర్లలో తలదాచుకునే ప్రయత్నం చేస్తుంటారు.
అయితే, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబరు 18న తొలి దశ పోలింగ్ జరగనున్న వేళ.. పాక్ కాల్పుల ఉల్లంఘనకు తెగబడటంతో కుట్రగా అనుమానిస్తున్నారు. మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1 న మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలను అక్టోబరు 8న వెల్లడిస్తారు.