ఏపీ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుపై, విధాన రూపకల్పనపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం సూచనలు చేశారని తెలిపారు. డ్వాక్రా గ్రూపులు ఎంఎస్ఎంఈలు స్థాపించేలా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. కామన్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం అందిస్తామని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. కొత్త జిల్లాల్లో డీఐసీలను పునరుద్ధరించనున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 50 ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తామని వివరించారు. మార్కెట్ అవసరాల మేరకు స్కిల్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ర్యాంప్ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు చేయూత ఇస్తామని, ర్యాంప్ పథకం కింద కేంద్రం రూ.100 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. ఎంఎస్ఎంఈలకు పెండింగ్ ప్రోత్సాహకాలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇక, నూతన ఎంఎస్ఎంఈ విధానంపై అధ్యయనం చేయాల్సి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ఎంఎస్ఎంఈ-1 పేరుతో వెబ్ సైట్ తీసుకువస్తున్నట్టు వెల్లడించారు.