తిరుపతి-మదనపల్లె రహదారిలోని భాకరాపేట ఘాట్ మరోసారి రక్తమోడింది. తరచూ ప్రమాదాలతో వార్తల్లో వుండే ఈ రోడ్డులో గురువారం జరిగిన అనూహ్య సంఘటనతో కర్ణాటకవాసులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.పోలీసుల కథనం మేరకు... కర్ణాటక రాష్ట్రం, చిక్‌బళ్ళాపుర సమీపంలోని హరిస్థలకు చెందిన తేజస్ కుమార్(35) తన తండ్రి మునివెంకటరెడ్డి(55), బావమరిది మంజునాథ(38)తో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి గురువారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. గోలచిందెనహళ్ళికి చెందిన రమే్‌షమూర్తి(34) కారు నడుపుతున్నాడు. 2గంటల సమయంలో భాకరాపేట ఘాట్ రోడ్డులో వెళ్తుండగా కలకడ నుంచి చెన్నైకి టమోటాలను తీసుకెళ్త్తున్న కంటైనర్ మలుపు వద్ద అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వీరి కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయిపోయింది. సమాచారం అందుకున్న చంద్రగిరి, భాకరాపేట సీఐలు సుబ్బరామిరెడ్డి, ఇమ్రాన్‌బాషా, కళ్యాణి డ్యామ్ వద్ద వున్న పోలీసు శిక్షణ కళాశాల ఎస్‌ఐలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.పొక్లయినర్‌తో కంటైనర్ కింద వున్న కారును బయటకు తీసేందుకు సాధ్యం కాకపోవడంతో తిరుపతి నుంచి ఒక క్రేన్, భాకరాపేట నుంచి మరో క్రేన్ రప్పించారు.ఈలోపు పోలీసులతో పాటు ఆ దారిలో వెళుతున్న వాహనదారులు కంటైనర్‌లో ఉన్న టమోటా బాక్సులను బయటకు తీశారు. మూడు గంటల సమయంలో క్రేన్ సాయంతో కంటైనర్‌ను అతి కష్టంపై పైకి తీసి, కారులోంచి కేకలు వేస్తున్న తేజస్ కుమార్‌ను బయటకు తీశారు.చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతి రుయాస్పత్రికి తరలించారు.కారులోనే ఇరుక్కుపోయి మృతి చెందిన రమే్‌షమూర్తి, మంజునాథ, మునివెంకటరెడ్డి మృత దేహాలను బయటకు తీశారు.ఎస్పీ సుబ్బరాయుడు, ఏఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ నర్సింగప్ప సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. మృతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.తరచూ ఇదే ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఎస్పీ జాతీయ రహదారి అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలను చేపడతామని తెలిపారు. కాగా కంటైనర్ డ్రైవర్ అల్లాహుద్దీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి.