కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ సీఎం వైయస్ జగన్ పర్యటించారు. ఏలేరు వరద ఉధృతితో అతలాకుతలమైన గ్రామాల సందర్శించారు. మాధవపురం, యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి, రమణక్కపేటలో వైయస్ జగన్ పర్యటించి, వరద బాధితులను పరామర్శించి, వారికి కలిగిన నష్టాన్ని ఆరా తీశారు. అనంతరం రమణక్కపేటలో వైయస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ............. చంద్రబాబూ.. ఇకనైనా జగన్నామం ఆపేసి నిజాయితీగా పాలన చేయడం నేర్చుకో..అంటూ వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హితవు పలికారు. రాష్ట్రంలో ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా చంద్రబాబు నిత్యం వైయస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అధికారంలో వచ్చి ఇన్నిరోజులు గడిచినా.. తాను చేయాల్సిన పనులేవీ చేయలేదు. దానంతటికి కారణం వైయస్ జగనే అంటారు. ఎక్కడ ఏం జరిగినా.. వైయస్ జగన్ పేరే చెప్తారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచింది. చేయాల్సిన దాని గురించి సీఎం ఆలోచించాలని, ప్రజలకు న్యాయంగా, ధర్మంగా ఇవ్వాల్సిన దాని మీద ధ్యాస పెట్టాలని వైయస్ జగన్ సూచించారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారాలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లాంటి ఎల్లో మీడియా తోడైయ్యిందని వైయస్ జగన్ పేర్కొన్నారు. గోబెల్స్ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస. అబద్ధాలను మ్యానుఫ్యాక్చర్ చేయడంలో దిట్ట. వాటిని అమ్ముకోగలిగే కెపాసిటీ ఈ భూమ్మీద కేవలం ఒక్క చంద్రబాబుకే ఉందని ఎద్దేవా చేశారు.