ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 07:23 PM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో బస్సు, రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.


మరోవైపు చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సును.. ఐరన్‌ లోడ్‌తో వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో అతివేగంతో వచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్ దాటి పక్క రోడ్డులో వస్తున్న బస్సును ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు మరో లారీ మీదకు దూసుకెళ్ళాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటుగా ఎనిమిది మంది చనిపోయారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు సమాచారం. లారీలోని ఇనుప చువ్వల కింద ఇరుక్కుని కొంతమంది చనిపోయినట్లు తెలిసింది.


అయితే ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. వెంటనే అక్కడకు చేరుకున్నారు. బాధితులను అంబులెన్సులలో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో బాధితుల ఆక్రందనలతో ఆస్పత్రి ప్రాంగణం వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది.


మరోవైపు చిత్తూరు రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అదుకుంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అలాగే ఆస్పత్రి వర్గాలకు ఫోన్ చేసి గాయపడినవారికి అందుతున్న సాయంపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com