ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగ యువతకు బంపరాఫర్.. జపాన్‌లో ఉద్యోగాలు.. జీతం రూ. లక్షకుపైనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 07:28 PM

విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్‌ఆర్ ఆధ్వర్యంలో జపాన్‌లోని ఆస్పత్రుల్లో కేర్‌టేకర్లుగా పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివినవారు ఇందుకు అర్హులు. అలాగే వయసు 32 ఏళ్లలోపు ఉండాలి. ఆసక్తికలిగిన వారికి జపనీస్ భాషను కూడా నేర్పిస్తారు. జపనీస్ భాషను ఎన్5, ఎన్4, ఎన్3 స్థాయిల్లో నేర్పించి, జపాన్ దేశంలో కేర్‌టేకర్స్‌గా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.


ఆసక్తి కలిగిన యువతకు బెంగళూరులోని నావిస్ హెచ్‌ఆర్‌లో ఆరు నెలలపాటు ట్రైనింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఆరునెలల శిక్షణ కోసం రూ.3.5 లక్షలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొదటి విడతగా 50 వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉటుందన్న నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి.. ఇందులో 25 వేల రూపాయలు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చెల్లిస్తుందని తెలిపారు. మిగతా 25 వేల రూపాయలు సదరు అభ్యర్థి చెల్లించాల్సి ఉంటుందన్నారు. మిగతా మూడు లక్షల రూపాయలను మూడు విడతల్లో చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపారు.


ఇక ట్రైనింగ్ పీరియడ్‌లో జపాన్ భాషను నేర్పుతారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న వారికి జపాన్‌లో ఉద్యోగ అవకాశం కల్పించడానికి కావాల్సిన సదుపాయాలను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ఎర్ పర్యవేక్షిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగం పొందిన వారికి జీతం నెలకు రూ.1,10,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 18వ తేదీ ఆఖరిరోజు కాగా.. ఆసక్తి కలిగిన వారు మరిన్ని వివరాలకు రాజమండ్రిలోని తూర్పుగోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మరోవైపు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లాల వారీగా కార్యాలయాలు ఏర్పాటు చేసి యువతకు ట్రైనింగ్ అందిస్తూ ఉంటుంది. ఇటీవలే చిత్తూరు జిల్లా యువతకు కూడా అక్కడి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇలాంటి అవకాశం కల్పించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com