మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ పిఠాపురం నియోజవకర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతుకు రూ.20 వేలు ఇస్తామన్నారు... ఏమైంది? అని ప్రశ్నించారు. తల్లికి వందనం కింద పిల్లలకు రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారని, దీని పరిస్థితి ఏమైంది? అని నిలదీశారు. ఈ సందర్భంగా తన హావభావాలతో జగన్ నవ్వులు పూయించారు. చిట్టి తల్లీ ఇటు రామ్మా... నీకు పదిహేను వేలు, నీ తమ్ముడికి పదిహేను వేలు, నీ చెల్లెలికి పదిహేను వేలు... సంతోషమా అని చంద్రబాబు చెప్పేవారని జగన్ వ్యంగ్యం ప్రదర్శించారు. అదే జగన్ అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని, చంద్రబాబు మాత్రం సూపర్-6లో మాత్రమే చెబుతాడని జగన్ విమర్శించారు. పిల్లలను, అక్కచెల్లెమ్మలను మోసం చేశాడని అన్నారు.ఇక, పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరును కూడా జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ప్రభుత్వం ఫొటోలకు మాత్రమే పరిమితవుతోందని విమర్శించారు. చంద్రబాబు అనే వ్యక్తి పూర్తిగా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాడు. పవన్ కల్యాణ్ సినిమాల్లోనే స్టార్... ఇక్కడ కాదు. పాపం, ఆయన కొత్తగా వచ్చాడు... ఆయనకేమీ తెలియదు. కానీ చంద్రబాబు మాత్రం పవన్ కల్యాణ్ ను మించిపోయాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్" అని జగన్ వ్యాఖ్యానించారు.