విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లకు భారీ ఆదాయం సమకూరింది. దేవస్థానం మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. 15 రోజుల్లో హుండీల ద్వారా వచ్చిన కానుకలను లెక్కించగా రూ.82,03,392 ఆదాయం వచ్చింది. భారీ వర్షం, బుడమేరు వరద దుర్గగుడి ఆదాయంపై తీవ్రంగా చూపించడంతో.. ఆదాయం తగ్గింది. అలాగే హుండీలా్లో బంగారు 145గ్రాములు, 1.870 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే 136 యుఎస్‌ఏ డాలర్లు, 40 కెనడా డాలర్లు, 25 కువైట్ దీనార్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, 20 హాంకాంగ్ డాలర్లు వచ్చినట్లు దేవస్థానం డిప్యూటీ ఈవో తెలిపారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు ఆన్‌లైన్‌లో రూ.1.03 లక్షల విరాళాలు దేవస్థానానికి సమర్పించారన్నారు. దుర్గమ్మ హుండీల్లో కానుకల లెక్కింపును ఈవో రామారావు, దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు.
మరోవైపు దసరా ఏర్పాట్లు, పవిత్రోత్సవాలు, ఆర్జిత సేవలకు సంబంధించి వైదిక కమిటీ సమావేశం నిర్వహించారు.. ఆలయ ఈవో రామారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే పవిత్రోత్సవాల్లో.. ఆలయంలో ఆర్జిత సేవలను భక్తులతో సంబంధం లేకుండా రుత్వికులు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించినట్లు ఈవో రామారావు తెలిపారు. దుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాల సమయంలో రాత్రి వేళ భక్తులను దేవస్థానం ప్రాంగణంలో నిద్ర చేయకుండా నియంత్రిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
రాష్ట్రంలోనే భారీ మట్టి గణనాథుడు విజయవాడలో కొలువుదీరాడు. నగరంలోని సితార సెంటర్లోని లేబర్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేశారు.. ఈ విగ్రహం 72 అడుగులు ఉంది. డూండీ గణేష్ సేవా సమితి మట్టితోనే విగ్రహాన్ని తయారు చేయించింది. అయితే ముందు వేడుకల్ని తొమ్మిది రోజులే నిర్వహించాలని నిర్ణయించింది.. కానీ ఈ వినాయక చవితి వేడుకలను 21 రోజులకు పొడిగించాలని నిర్వాహకులు నిర్ణయించారు. విజయవాడ వరదల నుంచి కోలుకోవడం, నిత్యం భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మట్టి గణపతిని నిలిపిన ప్రదేశంలోనే నిమజ్జనం చేస్తారు.