ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన తెలుగువారు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా వారంతా సెప్టెంబరు 11 నుంచి అక్కడే ఉండిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన 18 మంది భక్తులు.. సదరన్ ట్రావెల్స్ ద్వారా ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లారు. కేదార్‌నాథ్ దర్శనం తర్వాత వీరిలో 14 మంది బద్రీనాథ్ ఆలయానికి బయల్దేరారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్-బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో గత రెండు రోజులుగా తెలుగు యాత్రికులు కేదార్‌నాథ్‌లోనే చిక్కుకుపోయారు. వర్షాలకు తోడు తీవ్రమైన చలికి వీరు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ హెలికాప్టర్ సర్వీసులను కూడా అధికారులు నిలిపేశారు. కాగా, కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులతో విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్‌లో మాట్లాడారు. అధికారులతో తాను మాట్లాడామని.. ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని భాధితులకు చెప్పారు.
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికుల ఇబ్బందులపై కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌తోనూ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడారు. వారిని రక్షించాలని రెసిడెంట్ కమిషనర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. యాత్రికుల్లో పలువురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని.. వారిని హెలికాప్టర్లలో తరలించాలని ఎంపీ కోరారు. పౌరి గర్వాల్, కుమవన్ ప్రాంతంలో గురువారం భారీ వర్షం కురిసింది. గర్వాల్‌లో భారీగా మంచు కూడా కురస్తోందని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి.. రహదారులు మూసుకుపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి.. కేదార్‌నాథ్ యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, హరిద్వార్, నైనిటాల్, ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది. దీంతో ఆ నాలుగు జిల్లాల్లో విద్యా సంస్థలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సెప్టెంబరు 14 వరకు సెలవు ప్రకటించింది. కొండ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపింది.