విశ్వప్రసిద్ధ శ్రీక్షేత్రం పూరీ జగన్నాథుడి ఆలయంలో తరచూ చోటుచేసుకుంటోన్న అపశృతులపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, మరోసారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఒక వృద్ధుడు ఆలయ శిఖరంపైకి ఎక్కడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మూడంచెల భద్రత ఉన్న జగన్నాథుడి ఆలయంలో రహస్య మార్గం మీదుగా పతితపావన జెండా కట్టే శిఖరానికి చేరుకోవడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 70 ఏళ్ల వయసున్న వ్యక్తి ఈ సాహసానికి ఒడిగట్టాడు. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వృద్ధుడు శిఖరంపైకి ఎక్కిన విషయాన్ని ఆలస్యంగా గమనించిన సేవాయత్‌లు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీస్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని అతడ్ని కిందకు దిగిరావాలని సూచించారు. కొద్దిసేపటి తర్వాత శిఖరం దిగిన ఆయన ఆయాసంతో ఇబ్బంది పడుతుండటం గమనించి పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పూరీ ఎస్పీ పినాకి మిశ్రా మీడియాతో మాట్లాడుతూ... ఈ వృద్ధుడ్ని గంజాం జిల్లా ఛత్రపురానికి చెందిన బయ్యా మహరణగా గుర్తించామని తెలిపారు. ఆలయ శిఖరంపైకి వెళ్లడానికి కారణలేమిటన్న దానిపై విచారిస్తామని ఆయన చెప్పారు.
కాగా, ఆలయ పశ్చిమ ద్వారం గుండూ అతడు లోపలికి వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నారు. గత రెండు మూడు రోజుల పాటు వరుసగా ఆలయానికి వచ్చిన అతడు.. శిఖరంపైకి గరుడ సేవకులు ఎలా ఎక్కి జెండాను కడుతున్నారనేది గమనించాడని తెలిపాయి. అయితే, తనకు కలలో దేవుడు కనిపించి.. శిఖరాన్ని తాకాలని ఆజ్ఞాపించాడని చెప్పడం గమనార్హం. వృద్ధుడి మానసిక పరిస్థితి సరిగ్గాలేదని, గత పదేళ్లుగా బ్రహ్మపుర ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు మీడియా నివేదికలు వెల్లడించాయి.
కాగా, జగన్నాథ రథయాత్ర ప్రారంభానికి ముందు నుంచి పూరీలో వరుసగా పలు సంఘటనలు జరుగుతున్నాయి. రథయాత్రకు ముందు నిర్వహించే చందన్ యాత్రలో బాణా సంచా పేలుడు చోటుచేసుకుని.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత రథయాత్రలో బలబధ్రుడి విగ్రహం రథంపై నుంచి ఒరిగిపోయి.. సేవాయత్‌లపై పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గుండిచా ఆలయానికి చేరుకున్న జగన్నాథుడు, బలబధ్రుడు, సుభద్ర దేవి సహా చతుర్థామూర్తుల పొహండి సమయంలో విగ్రహం ఒరిగిపోయింది. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. దీనిపై సేవాయత్‌లు, భక్తుల్లో ఆవేదన వ్యక్తమైంది. తాజాగా, శిఖరంపైకి ఓ వ్యక్తి ఎక్కడంతో భక్తులు విస్మయానికి గురయ్యారు. ఇది భద్రతా వైఫల్యమేనని, స్వామివారి ఆలయ రహస్య మార్గంలోకి అతడు ఎలా వెళ్లగలిగాడనేది చర్చనీయాంశంగా మారింది.