విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో అగ్నిప్రమాదంపై యాజమాన్యం వివరణ ఇచ్చింది. లిథియం బ్యాటరీ కంటైనర్ లోడ్ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ అధికారులు తెలిపారు. లిథియం బ్యాటరీలను అన్‌లోడ్ చేస్తున్న సమయంలో కంటైనర్‌లోని ఒక బాక్స్‌లో పొగలు వ్యాపించాయని వైజాగ్ కంటైనర్ టెర్మినల్ అధికారులు తెలిపారు. పొగలు వ్యాపించిన వెంటనే చర్యలు తీసుకోవటంతో ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనతో ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
మరోవైపు ఈ కంటైనర్ లోడ్ ఆగస్ట్ 28వ తేదీన విశాఖకు చేరినట్లు కంటైనర్ టెర్మినల్ అధికారులు తెలిపారు. చైనా నుంచి కోల్‌కతా వెళ్తున్నట్లు వివరించారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరాతీసినట్లు తెలిసింది. వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం కంటైనర్ టెర్మినల్‌లో ప్రమాదం జరిగింది. కంటైనర్ వద్ద నుంచి పొగలు వ్యాపించడంతో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే పోర్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై వాటిని ఆర్పివేశారు. దీనిపైనే కంటైనర్ టెర్మినల్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వెల్లడించారు. మరోవైపు రజనీకాంత్ మూవీ షూటింగ్ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే జరుగుతున్నట్లు తెలిసింది. కంటైనర్ నుంచి పొగలు రావటంతో అక్కడి నుంచి మార్చినట్లు సమాచారం.
అనకాపల్లి జిల్లాలో ప్రమాదం
మరోవైపు అనకాపల్లి జిల్లాలో జలపాతం వద్ద ఇద్దరు పర్యాటకులు గల్లంతయ్యారు. జిల్లాలోని అనంతగిరి మండలం సరియా జలపాతాన్ని చూడ్డానికి ఇటీవల కాలంలో పర్యాటకులు వస్తున్నారు. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాకు చెందిన ఓ 8 మంది పర్యాటకులు సరియా జలపాతం చూడ్డానికి వచ్చారు. అయితే జలపాతం అందాలు వీక్షించే సమయంలో ప్రమాదవశాత్తూ ఓ పర్యాటకుడు జలపాతంలో పడి గల్లంతయ్యారు. ఇతణ్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమయంలోనే మరో పర్యాటకుడు కూడా గల్లంతయ్యాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.