ఆంధ్రప్రదేశ్‌లోని స్కూలు విద్యార్థులకు శుభవార్త. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏపీ ప్రభుత్వం సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. రేపు ఆదివారం సెలవుతో పాటుగా సోమవారం కూడా సెలవు ప్రకటించడంతో విద్యార్థులకు రెండు రోజులు సెలవులు వచ్చినట్లైంది. మంగళవారం రోజు పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. వాస్తవానికి శనివారంతో కలిపి మూడు రోజులు సెలవులు రావాల్సి ఉండేది. అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ మధ్యకాలంలో ఏపీలో పాఠశాలలకు చాలా సెలవులు ప్రకటించారు. పలు జిల్లాలలో వరుస సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్కూలు పనిదినాలను దృష్టిలో ఉంచుకుని రెండో శనివారం కూడా (సెప్టెంబర్ 14) పాఠశాలలు నిర్వహించారు.
ఇప్పుడు సెప్టెంబర్ 15 (ఆదివారం) తోడు సెప్టెంబర్ 16( మిలాద్ ఉన్ నబీ) సెలవు కూడా రావటంతో రెండు రోజులు సెలవులు వచ్చాయి. మరోవైపు ఈ నెలలో మరో మూడు రోజులు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. రెండు ఆదివారాలతో పాటుగా నాలుగో శనివారం కూడా విద్యార్థులకు సెలవు లభించనుంది. మరోవైపు తెలంగాణలో మాత్రం మిలాద్ ఉన్ నబీ సెలవును మంగళవారం జరుపుకోనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన మిలాద్ ఉన్ నబీ సెలవు రోజుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనంతో పాటుగా మిలాద్ ఉన్ నబీ ఒకే రోజు జరుపుకోనున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
ఏపీని ఇటీవలి కాలంలో భారీ వర్షాలు, వరదలు వణికించాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు జిల్లాలలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలలో వరదలు, వర్షాల ప్రభావం అధికంగా ఉంది. దీంతో ఆయా జిల్లాలలోని పరిస్థితులను అనుసరించి సెలవులు ప్రకటించే అధికారం కలెక్టర్లకే కేటాయించారు. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ హెచ్చరికలతో పలు జిల్లాలలో సెలవులు ప్రకటించారు. ఈ వరుస సెలవుల కారణంగా విద్యార్థుల చదువుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే రెండో శనివారం సెలవు రోజు అయినప్పటికీ తరగతులు నిర్వహించారు.