ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరికొంత భూమి అవసరం కాగా.. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతుల వద్ద నుంచి భూమిని సేకరిస్తోంది. ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ఆదివారం సాయంత్రం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రబాలెం గ్రామ రైతుల వద్దకు వెళ్లారు. గ్రామంలోని 11 మంది రైతుల నుంచి 12.27 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అంగీకార పత్రాలను రైతుల వద్ద నుంచి నారాయణ తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నారాయణ.. రాజధాని రైతులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానం కింద భూములు ఇచ్చే రైతులకు వారు కోరిన చోట స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు.
రాజధాని నిర్మాణం కోసం ఎవరైనా రైతులు భూములు ఇవ్వాలనుకుంటే తెలియజేయాలన్న నారాయణ.. తానే స్వయంగా వారి ఇంటి వద్దకే వచ్చి తీసుకుంటామని అన్నారు. గతంలో ల్యాండ్ పూలింగ్ విధానం కింద భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించామన్న నారాయణ.. ఈసారి భూములు ఇచ్చేవారికి మాత్రం ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూములు ఉన్నచోట ఎక్కడ కోరితే అక్కడ వారికి ప్లాట్లు కేటాయిస్తామని ప్రకటించారు. మరోవైపు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు సెప్టెంబర్ 17 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జంగిల్ క్లియరెన్స్ పనులు ఆగాయన్న మంత్రి.. ఎల్లుండి నుంచి మళ్లీ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మరోవైపు 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి భూమిని సేకరించేందుకు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని చేపట్టింది. ఈ విధానంలో భాగంగా 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను అప్పట్లో సేకరించారు. నిర్మాణానికి మరో నాలుగు వేల ఎకరాలు అవసరం కాగా.. అప్పట్లో కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత వైసీపీ సర్కారు అధికారంలోకి రావటంతో అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో మిగతా భూమి కోసం తిరిగి ల్యాండ్ పూలింగ్ ప్రారంభించింది.