ఏపీ మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఫ్యామిలీకి చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తిరుమలలో అపచారం జరిగిందనీ.. మంత్రి కుటుంబసభ్యులు అనుచరులు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో నాగిని డ్యాన్స్ వేశారంటూ ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మంత్రి భర్తతో పాటుగా మరికొందరు మీడియా ప్రతినిధులు కూడా చిందులు వేశారంటూ ఈ వీడియోను కొంతమంది వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వీడియోపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తిరుమల శ్రీవారితో పెట్టుకోవద్దంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను హెచ్చరించారు. విజయవాడలో మంత్రి ఇంట్లో జరిగిన వీడియోను తిరుమలలో జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నారా లోకేష్ మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ మీద విమర్శలు గుప్పించారు.
"ఫేక్ జగన్ నువ్వు మారవు.. నీ ఫేక్ మూకలు అస్సలు మారరు. ఫేక్ చేసి చేసీ 151 నుంచి 11కి వచ్చావు.. మంత్రి సంధ్యారాణి విజయవాడ ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలు తిరుమలలో జరిపినట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నావు.. శ్రీవారితో పెట్టుకోవద్దు.. ఏడుకొండలపై నీ విష రాజకీయాలు వాడొద్దు. ఒక్క సీటు కూడా లేకుండా పోతావ్.." అంటూ వార్నింగ్ ఇచ్చారు.
అటు మంత్రి గుమ్మడి సంధ్యారాణి సైతం ఈ వీడియోపై స్పందించారు." నిన్నటి నుంచి మీరందరూ ఓ వీడియో, కొన్ని ఫోటోలు చూస్తున్నారు. సభ్యతా సంస్కారం లేకుండా కొన్ని కుక్కలు నా కుటుంబాన్ని, నా భర్తను, నా పిల్లలను అవమానించాలని కొన్ని ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. కుక్కలను పట్టించుకోవడం ఎందుకులే అని నేను దానికి సమాధానం చెప్పలేదు. కానీ నన్ను అభిమానించే ప్రజలు దీనిపై ఆందోళన చెందుతున్నారు. అందుకోసమే నేను వివరణ ఇస్తున్నా. ఆగస్ట్ 29వ తేదీ నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు విజయవాడలో మేము మా ఇంట్లో పార్టీ చేసుకున్నాం. భోజనాలు చేశాం. నా పిల్లలు డ్యాన్స్ కూడా చేశారు. అయితే 31వ తేదీ తిరుమలకు వెళ్లాము. కొండను నడుచుకుంటూ ఎక్కాం. ఒకటో తేదీ ఉదయం శ్రీవారి దర్శనం అయ్యింది. అదే రోజు రాత్రి విజయవాడలో వరదల కారణంగా సీఎం కలెక్టరేట్‌లోనే ఉన్నారని తెలిసింది. వెంటనే నేను వచ్చేశాను".
" అయితే తిరుమలలో మేము ఎవరూ పద్మావతి గెస్ట్ హౌస్‌లో లేము. అమ్మవారిని కొలిచే వ్యక్తిగా, ముత్యాలమ్మ తల్లి జాతరను జరిపించే వంశంలో పుట్టిన ఆడబిడ్డగా చెప్తున్నా.. తిరుపతిలో అలాంటి పనులు ఎవరు చేస్తారో మీకు తెలుసు. అమ్మవారిని కొలిచే వ్యక్తిగా, గోవిందనామాలు జపించే వ్యక్తిగా చెప్తున్నా.. ఆ వీడియోలు వైరల్ చేసే కుక్కలు ఎవరో కానీ.. భగవంతుడు మాత్రం మిమ్మల్ని క్షమించడు.." అంటూ ఎమోషనల్ అయ్యారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ వీడియోపై స్పందించింది. తిరుమలలో అపచారం అంటూ జరుగుతున్న ప్రచారం తప్పని.. ఆ వీడియో పద్మావతి గెస్ట్ హౌస్‌లో జరిగింది కాదనీ క్లారిటీ ఇచ్చింది.