ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఉన్నత విద్యా వ్యవస్థలో మార్పులకు సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని.. అక్కడ సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు ప్రకటన ఇచ్చినట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు.
'రాష్ట్రంలో గత 5ఏళ్లుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించాము. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చాం. పరిశోధనపై దృష్టి సారించి, ర్యాంకింగ్స్ మెరుగుపర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలోని వర్శిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం కలిగిన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. చివరి తేదీ: సెప్టెంబర్ 28,2024'అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు మంత్రి నారా లోకేష్ వర్సెస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య సీబీఎస్‌ఈ విషయంలో ట్వీట్ వార్ జరిగింది. ఏపీలో సీబీఎస్‌ఈ రద్దు చేస్తున్నారంటూ జగన్ ఆరోపించారు. గవర్నమెంటు స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారని విమర్శించారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారన్నారు. 'ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ, గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? వాళ్లు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపంపెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి?' అని ప్రశ్నించారు.
దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో గవర్నమెంటు స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దుచేయడం ఎంతవరకు సమంజసం? అన్నారు జగన్. గవర్నమెంటు స్కూలు పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువకాదన్నారు. వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యంచేసే తప్పుడు పనులు మానుకోవాలని.. తాము తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలు ప్రపంచస్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయొద్దని.. లేదంటే పేదప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు.
జగన్ ట్వీట్‌కు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. 'ఏం చదివావో తెలియదు..ఎక్కడ చదివావో అస్సలు తెలియదు..నువ్వు విద్య శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేకు జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన పదో తరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్య సంవత్సరం 6వ తరగతి నుండే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సిబిఎస్ఈ లో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం. గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంస మామ అయిన మీరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. అన్నట్టు మీరు అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టో సెలవివ్వండి' అంటూ ట్వీట్ చేశారు.