చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని మంత్రి సవిత తెలిపారు. ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. ఈరోజు(మంగళవారం) సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం అయింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి సవిత కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. రూ.110 కోట్ల డైట్ ఛార్జీల బకాయిలు విడుదలకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రూ.20.52 కోట్ల కాస్మొటిక్ ఛార్జీల బకాయిల విడుదలకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులకు రూ.10 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు.ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధరణ చేస్తున్నట్లు చెప్పారు. బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలపై నివేదికలు కోరుతున్నామన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల బలోపేతానికి రూ.10 కోట్లు విడుదల చేస్తామని అన్నారు. కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నట్లు మంత్రి సవిత వివరించారు. ఏపీలో 5 చోట్ల ఫ్యాకల్టీ డెవలప్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. కాపు భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి సవిత వెల్లడించారు.