తిరుమలలో అన్నపానీయాలు అందలేదంటూ నిన్న (సోమవారం) ఓ భక్తుడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఫిర్యాదు చేయడంపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఈవో బయటపెట్టారు. మంగళవారం మీడియాతో ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. భక్తుడి ఫిర్యాదు అంశాన్ని సీరియస్‌గా పరిగణించామని తెలిపారు. భక్తుడు క్యూ లైన్లో ప్రవేశించిన సమయంతో పాటు క్యూ లైన్లో వేచి ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించామని తెలిపారు. సిసి పుటేజ్ ఆధారంగా భక్తుడు రాత్రి 10:30 గంటలకు క్యూ లైనులో ప్రవేశించి.. ఉదయం 10:45 గంటలకు వెలుపలికి వచ్చేశాడని తెలిపారు. క్యూ లైనులో ఉన్న సమయంలో భక్తుడు రెండు సార్లు అన్నప్రసాదం స్వీకరించారన్నారు. నిన్న ఉదయం కూడా భక్తులు పాలు స్వీకరించారని వెల్లడించారు. భక్తుడిని పిలిపించి విచారణ జరిపామని... క్యూ లైన్లో అధిక సమయం వేచి ఉండలేక ప్రస్టేషన్ కారణంగా మంత్రికి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అన్నపానీయాలు అందజేస్తున్నారన్నారు. నిజంగా సమస్యలు ఉంటే టీటీడీ దృష్టికి తీసుకువస్తే.. తప్పకూండా వాటిని సరిదిద్దుకుంటామని వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకుల మనోధైర్యం దెబ్బతినేలా భక్తులు ఆరోపణలు చెయ్యవద్దని టీటీడీ ఈవో శ్యామలరావు విజ్ఞప్తి చేశారు.