ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ కొత్త సీఎంగా అతిషీనే ఎందుకు.. కేజ్రీవాల్‌ స్థానంలో కరెక్ట్ ఛాయిస్

national |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2024, 11:38 PM

ఆమ్ ఆద్మీ పార్టీకి, గత 10 ఏళ్లలో ఢిల్లీ ప్రభుత్వంలో కీలక చక్రం తిప్పిన అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి 5 నెలల పాటు తీహార్ జైలులో ఉండి.. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు షాకింగ్ ప్రకటన చేశారు. అదే సమయంలో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కోర్టులో విజయం సాధించిన తర్వాతే ఢిల్లీ సీఎం పీఠంపై కూర్చుంటానని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం రాజీనామా చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలవనున్నారు. దీంతో కొత్త సీఎం ఎవరు అనే చర్చకు ఇవాళ ఉదయం ఆప్ వర్గాలు తెరదించాయి. ఢిల్లీ మహిళా మంత్రి అతిషీ మార్లేనాను తదుపరి సీఎంగా నియమించేందుకు ఆప్ ఎమ్మె్ల్యేలు ఆమోదం తెలిపారు.


ఈ క్రమంలోనే అసలు ఢిల్లీ సీఎం పదవికి అతిషీ మాత్రమే ఎందుకు అనే చర్చ జరుగుతోంది. అయితే కేజ్రీవాల్ రాజీనామాతో ఆ స్థానంలో కూర్చునేందుకు ఆప్ వర్గాలు అతిషీనే ఎంచుకున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తన మాటలతో ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టడంలో అతిషీ మార్లేనా ముందు ఉంటారు. ఉన్నత చదువులు చదివిన అతిషీ మార్లేనా.. మనీష్ సిసోడియా తర్వాత ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనే మార్చేశారు. అంతేకాకుండా గత 2ఏళ్లుగా ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో.. ఆప్ ప్రతిష్ఠ దెబ్బతినడంతో.. మళ్లీ ఎన్నికల్లో సత్తాచాటాలన్నా, పార్టీపై పడిన మచ్చను తొలగించాలన్నా ఈ సమయంలో ఢిల్లీ సీఎంపై గురుతర బాధ్యత ఉంటుంది. దీంతో ఆమె వైపే ఆప్ వర్గాలు మొగ్గు చూపాయి.


అయితే కేజ్రీవాల్‌ రాజీనామా ప్రకటనతో తర్వాతి సీఎం రేసులో పలువురు ఆప్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అతిషీతోపాటు గోపాల్‌ రాయ్‌, కైలాష్ గెహ్లోత్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, సునీతా కేజ్రీవాల్‌ వంటి వారి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయన పేరును పక్కన పెట్టారు. చివరికి ఆప్ వర్గాలు మాత్రం అతిషీకే పట్టం కట్టాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి.


కేజ్రీవాల్‌ పక్కనే అత్యంత సన్నిహితులుగా ఉండేవాళ్లలో అతిషీ మినహా మిగిలిన వారు ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లారు. మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కావడంతో కీలక నేతలు లేక.. ఆప్‌లో గట్టి నాయకులు ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే అప్పుడే సీఎం రేసుకు అతిషి పేరు తెరపైకి వచ్చినా.. కేజ్రీవాల్‌ రాజీనామా చేయకుండా తీహార్ జైలు నుంచే ఢిల్లీ పాలనా వ్యవహారాలు చూసుకున్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అన్నీ తానై సౌరభ్‌ భరద్వాజ్‌తో కలిసి అతిషీ మార్లేనా నిలిచారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు.. ఆప్‌పై ప్రతిపక్షాలు చేసిన దాడులను ఆమె సమర్థవంతంగా తిప్పికొట్టారు.


మరోవైపు.. హర్యానా నుంచి ఢిల్లీకి నీటిని విడుదల చేయడం లేదంటూ అతిషీ జూన్‌లో ఏకంగా నిరాహార దీక్ష చేపట్టారు. అప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రితోపాటు కీలక మంత్రులైన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లడంతో వారి శాఖలు మొత్తం అతిషీ చూసుకున్నారు. ఈ క్రమంలోనే అతిషీ 14 శాఖల బాధ్యతలను తలకెత్తుకున్నారు. అందులో కీలకమైన విద్య, ఆర్థికం, ప్రణాళికా విభాగం, పీడబ్ల్యూడీ, జల, విద్యుత్తు, ప్రజాసంబంధాలు శాఖలు ఉన్నాయి.


ఇక ఆప్‌ మొత్తంలోనే అత్యధిక పై చదువులు చదువుకున్న వ్యక్తిగా అతిషీ ఉన్నారు. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అతిషీ.. రోడ్స్‌ స్కాలర్‌షిప్‌పై ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారు. మరోవైపు.. ఆప్‌లో చేరడానికి ముందు ఆమె 7ఏళ్లపాటు మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం, విద్యాభ్యాసంపై పని చేశారు. చాలా స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం అతిషీకి ఉంది. 2015లో మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా జిల్లాలో జరిగిన జల్‌ సత్యాగ్రహ్‌లో పాల్గొన్న అతిషీకి.. ఆప్‌ నేతలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసినపుడు సభ్యత్వం తీసుకున్న అతిషీ.. 2013 ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్‌ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ ఏర్పాటు తర్వాత విధానాల రూపకల్పనలో అతిషీ ప్రముఖ పాత్ర వహించారు.


జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల.. హారతి పట్టిన తల్లి


అతిషీ మార్లేనా 1981 జూన్‌ 8వ తేదీన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు విజయ్‌ సింగ్‌, త్రిప్త వాహి ప్రొఫెసర్లుగా పనిచేసేవారు. అయితే అతిషీ పేరులో "మార్లేనా" చేర్చడం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. కార్ల్‌ మార్స్క్‌, లెనిన్‌ పేర్లలోని కొన్ని భాగాలను కలిపి.. అతిషీ తల్లిదండ్రులు మార్లేనా అనే పేరును చేర్చారు. ఇక 2018 ఎన్నికల ముందు నుంచి అతిషీ తన ఇంటి పేరును వాడటం మానేశారు. 2003లో ఆక్స్‌ఫర్డ్‌ నుంచి హిస్టరీలో మాస్టర్స్‌ చేసిన అతిషీ.. ఆ తర్వాత 2005లో రోడ్స్‌ స్కాలర్‌ షిప్‌ ఆమెకు లభించింది.


2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అతిషీ.. మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌పై 4.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి 11వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com