50 ఏళ్లలో విజయవాడ చూడని భారీ వరద కారణంగా నగరంలోని 16 డివిజన్ల పరిధిలోని దాదాపు 2.5 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. భారీ వరదలకు లక్షలాది మంది ఇళ్లలోని వస్తువులు, ఎలక్ట్రానిక్ సామాగ్రితో పాటు సర్వస్వం కోల్పోయారని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం ప్రకటించిన అరకొర సాయంతో వారికి ఎలాంటి మేలు జరగదని స్పష్టం చేశారు. గ్రౌండ్ ప్లోర్‌కు ప్రకటించిన రూ.25 వేల సాయాన్ని రూ.50 వేలకు పెంచాలని, ఫస్ట్ ఫ్లోర్‌కు రూ.10 వేలు సాయం అందించాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఎంఎస్‌ఎంఈలకు తీవ్ర నష్టం జరిగిందన్న మల్లాది.. ప్రింటింగ్, పాడి పరిశ్రమ, చిరు వ్యాపారాలు, ఫర్నీచర్ పరిశ్రమలు దెబ్బ తిన్నాయని కాబట్టి, వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.