నిరుపేద విద్యార్థులకు కూడా వైద్య విద్యను అందుబాటులోకి తేవడానికి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి గత ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టారని, వాటన్నింటినీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రేవేటీకరణ చేయాలనుకోవడం దుర్మార్గపు ఆలోచన అని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఇది పెద్ద స్కామ్ అన్న ఆమె.. దీని వెనక భారీ అవినీతి, కుట్ర ఉందని ఆరోపించారు. గుంటూరులోని తన నివాసంలో మాజీ మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడారు. వైద్య విద్యను మరింత అందుబాటులోకి తేవడంతో పాటు, రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందేలా దాదాపు రూ.8 500 కోట్ల వ్యయంతో గత ప్రభుత్వంలో సీఎం శ్రీ వైయస్ జగన్, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని మాజీ మంత్రి తెలిపారు. ఇప్పుడు వాటిని ‘4పీ’ పేరుతో అప్పనంగా ప్రైవేటుపరం చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని చెప్పారు. ఇది ఒక పెద్ద స్కామ్ అని ఆమె అభివర్ణించారు.