వరద ముంచెత్తి 20 రోజులు గడిచినా ఇప్పటికీ సాధారణ పరిస్థితులు రాలేదని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వరదల కారణంగా దాదాపు 5 వేల మంది ఆటో కార్మికులు జీవనోపాధిని కోల్పోయారని, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి పాడైపోయిన వాహనాలను ఉచితంగా సర్వీసింగ్ చేయించడం లేదా కొత్త వాహనాలు ఇప్పించాలని కోరారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న దాదాపు 10 వేల క్లెయిమ్‌లు తక్షణం పరిష్కరించాలని సూచించారు. వరద ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు రద్దు చేయాలని, బ్యాంకు రుణాలకు మూడు నెలల మారటోరియం ప్రకటించడమే కాకుండా, వారికి రూ.2 లక్షల వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని కోరారు. విజయవాడ వరద బాధితులకు పార్టీ తరపున రూ.1.10 కోట్ల విలువైన నిత్యావసర సరుకులు అందజేసినట్లు అవినాష్ వివరించారు.